హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బలహీన వర్గాల వ్యతిరేకి అని తేటతెల్లమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ దుయ్యబట్టారు. రెండు సీట్లలోనూ అగ్రవర్ణాలకు కట్టబెట్టడంతోనే ఆయన కపటప్రేమ బట్టబయలైందని మండిపడ్డారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ విప్లవ్కుమార్తో కలిసి తలసాని ఆయన మీడియాతో మాట్లాడారు.
రేవంత్‌రెడ్డి తన చేతిలో ఉన్న పనిచేయకుండా.. సాధ్యంకాదని తెలిసీ కూడా బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో డ్రామాలు చేశారని ధ్వజమెత్తారు. కులగణన సర్వే హైదరాబాద్‌లో 25శాతం కూడా పూర్తిచేయలేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌కు బీసీలంటే మొదటినుంచీ చిన్నచూపేనని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎమ్మెల్సీ స్థానాలను బీసీ వర్గాలకు కేటాయించకపోవడం శోచనీయమని తలసాని వ్యాఖ్యానించారు. బీసీ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రేవంత్‌రెడ్డి భయంలేకుండా ఉన్నతవర్గాలకు పెద్దపీట వేయడాన్ని బీసీ సమాజం అర్థంచేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. బీసీలపై మీకు నిర్లక్ష్యమెందుకు? వారు అభ్యర్థులుగా పనికిరారా? బీసీలు కాంగ్రెస్‌కు ఓటేయలేదా? గ్రాడ్యుయేట్లలో పోటీ చేసేందుకు బీసీల్లేరా? వారు అవసరం లేదా? అని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మైనారిటీలు, బడుగు బలహీనవర్గాలు ఏకమై ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెట్టాలని, బీసీల సత్తా చూపాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు గోరీ కట్టిన హస్తం పార్టీకి సమాధికట్టాలని అన్నారు.
పాలనా వైఫల్యాలు, ఆరు గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమైన రేవంత్‌రెడ్డి డైవర్షన్ డ్రామాలు చేస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఇందులో భాగంగానే సిరిసిల్ల పర్యటనకు వెళ్లారని స్పష్టంచేశారు. సిరిసిల్లకు వెళ్లేందుకు అంతమంది పోలీసులు ఎందుకు? సిరిసిల్ల తెలంగాణలో భాగం కాదా? శత్రుదేశంపైకి దండయాత్ర చేసినట్టు వ్యవహరించడమెందుకు? అని సూటిగా ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి సిరిసిల్లపై అంత ప్రేమ ఉంటే మఫత్‌లాల్ కంపెనీని పక్కనబెట్టి గురుకులాల కాంట్రాక్ట్‌ను నేత కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఎమ్మెల్యే అయిన తర్వాతే సిరిసిల్ల రూపురేఖలు మారాయని గుర్తుచేశారు. సీఎం ఎక్కడికైనా వెళ్లవచ్చు.. ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చు కానీ బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం ఎందుకని నిలదీశారు. ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ మంచి అభ్యర్థిని బరిలో నిలిపి కైవసం చేసుకుంటుందని చెప్పారు.