జనగామ, జూలై 8 (నమస్తే తెలంగాణ)/హనుమకొండ : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 81, 85 ప్రకారం 60 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసత్వ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు సోమవారం హనుమకొండ, జనగామ కలెక్టరేట్ల ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏలను రెగ్యులర్ చేస్తూ కారుణ్య (వారసత్వ) నియామకాల కోసం 2023 జూలై 24న అప్పటి కేసీఆర్ ప్రభుత్వం జీవో 81, 85 ప్రకారం రాష్ట్రంలోని 20,555 మంది వీఆర్ఏల్లో అర్హతలను బట్టి 16,758 మందిని వివిధ ప్రభుత్వశాఖల్లో నియమించి, ఐడీలు ఇచ్చిందన్నారు. అయితే 61 సంవత్సరాల పైబడిన 3,797 మంది వారసులకు ఉద్యోగం ఇవ్వాలన్న ఆదేశాలపై అప్పట్లో కోర్టు స్టే విధించడంతో నియామక ఉత్తర్వులు నిలిచిపోయానని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్ 21న హైకోర్టు డివిజన్ బెంచ్ జీవోపై ఉన్న స్టే ఎత్తివేసినా వీఆర్ఏ వారసులకు నియామక ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో తమ కుటుంబాల ఆర్ధిక పరిస్థితి దారుణంగా తయారైందని, అందులో ఇప్పటికే 17 మంది మరణించారని వాపోయారు. జీవో ప్రకారం విద్యార్హతల సర్టిఫికెట్లు, కుటుంబ సభ్యుల నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, అఫిడివిట్, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు ప్రభుత్వానికి సమర్పించి 11 నెలలైందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ వారసులకు నియామక ఉత్తర్వులు ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ వీఆర్ఏలు హనుమకొండ, జనగామ జిల్లాల కలెక్టర్లు పీ ప్రావీణ్య, షేక్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు.