హనుమకొండ చౌరస్తా, జనవరి 31 : కాకతీయ విశ్వవిద్యాలయ నూతన రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ వీ రామచంద్రం నియమితులయ్యారు. వీసీ ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు అడ్మినిస్ట్రేషన్ విభాగ సహాయ రిజిస్ట్రార్ ప్రణయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రామచంద్రం విశ్వవిద్యాలయంలో 1991లో ప్రవేశించారు. గతంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, విశ్వవిద్యాలయ అభివృద్ధి అధికారిగా, పొలిటికల్ సైన్స్ విభాగాధిపతిగా, పాఠ్యప్రణాళికా అధ్యక్షుడిగా పనిచేశారు.
ప్రస్తుతం దూరవిద్యా కేంద్ర సంచాలకులుగా, సైకాలజీ విభాగాధిపతిగా, కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్ డీన్‌గా, విశ్వవిద్యాలయ విద్యా కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. 47 సెమినార్లు, కాన్ఫరెన్స్‌లకు హాజరయ్యారు. 34కు పైగా పత్రాలను వివిధ సెమినార్లలో సమర్పించారు. 2 పుస్తకాలు రాశారు. 31పైగా పబ్లికేషన్లు కలిగి ఉన్నారు. శుక్రవారం ఆయన ప్రొఫెసర్ మల్లారెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు.