హనుమకొండ, సెప్టెంబర్ 12: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మానవజాతి మనుగడను మైక్రోబయోలజీ నిర్దేశిస్తుందని కాకతీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్ రామిరెడ్డి అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాల(కేజీసీ)లో శుక్రవారం ఒకరోజు జాతీయస్థాయి మైక్రోబయాలజీ సెమినార్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి.శ్రీనివాస్, సదస్సు కన్వీనర్ డాక్టర్ పి.పల్లవి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామిరెడ్డి మాట్లాడుతూ ఇటీవలి సంవత్సరాల్లో జీవుల జీవనాన్ని అర్థం చేసుకోవడంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఆధునిక మాలిక్యులర్ సాంకేతికతలు, కంప్యూటేషనల్ పద్ధతులు, బయోస్టాటిస్టిక్స్ విధానాల కలయిక కొత్త మార్గాలను తెరిచాయన్నారు.
నూతన తరగతి సీక్వెన్సింగ్, మైక్రోఅర్రేలు, ఒమిక్స్వంటి ఆధునిక సాంకేతికతలు దీనికి తోడ్పడు తున్నాయని, వీటి ద్వారా జీనోమిక్స్, సింథటిక్ బయాలజీ, సిస్టమ్స్బయాలజీ వంటి ఉపశాఖలు పుట్టుకొచ్చి జీవవ్యవస్థల్లో జరిగే సున్నితమైన ప్రక్రియలను వెలికితీస్తున్నాయన్నారు. నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పెరుగు శ్యామ్ మాట్లాడుతూ జీనోమిక్స్ విస్తృతమైన డేటాసెట్లను ఉత్పత్తి చేస్తుందని, ఇవి సాంప్రదాయ విశ్లేషణ పద్ధతులకు సవాళ్లు విసురుతాయని, ఏఐ, మెషీన్ లెర్నింగ్ అనేవి అనోటేషన్, ఫంక్షనల్ ప్రిడిక్షన్, సూక్ష్మజీవుల వర్గీకరణలో విస్తరించదగిన, సమర్థవంతమైన సాధనాలను అందిస్తాయన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్మోహన్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ పాల్గొని మాట్లాడారు. ఈ సెమినార్ పరిశోధకులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు కొత్తదారులను చూపనుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో సుమారు 120కిపైగా పరిశోధన పత్రాలు సమర్పించారు.