హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 18 : కాకతీయ యూనివర్సిటీకి ప్రభుత్వం ఎట్టకేలకు వైస్ చాన్స్‌లర్‌గా కే ప్రతాప్‌రెడ్డిని నియమించింది. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ మే 21న ఉద్యోగ విరమణ పొందగా ఐదు నెలల తర్వాత వీసీని నియమించారు. వర్సిటీ 15వ వీసీగా ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత జంతుశాస్త్ర విభాగ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డిని నియమించింది. ప్రతాప్‌రెడ్డి జువాలజీ విభాగంలో విశిష్ట విద్యావేత్త.. మూడు దశాబ్దాలకుపైగా బోధన, పరిశోధనా అనుభవం కలిగి ఉన్నారు. 1961 జూన్ 15న రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో జన్మించిన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1981లో జువాలజీలో డిస్టింక్షన్‌తో బీఎస్సీ(హానర్స్) పూర్తి చేశారు. 1983లో న్యూరోబయాలజీలో ఎమ్మెస్సీ, 1988లో జువాలజీ (న్యూరోబయాలజీ)లో పీహెచ్డీ చేశారు.
ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి తన విద్యావృత్తిని 1989లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రారంభించారు. 1998లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 2006లో పూర్తి ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 2021లో పదవీ విరమణ చేశారు. ప్రతాప్‌రెడ్డి 25 మందికిపైగా పీహెచ్డీ విద్యార్థులకు మార్గనిర్దేశకుడిగా వ్యవహరించడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో 104కిపైగా ప్రచురణలు చేశారు. ఆయనకు 1,319 సిటేషన్లు, 16 హెచ్-ఇండెక్స్, 21 ఐ-ఇండెక్స్ ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో 487 పత్రాలను సమర్పించారు. 7 పుస్తకాలు ప్రచురించారు.12 ముఖ్య పరిశోధనా ప్రాజెక్టులను పూర్తి చేశారు.
బోధనా పరిశోధనలో ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి చేసిన కృషికి తోడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పలు కీలక పరిపాలనా పదవులను నిర్వర్తించారు. 2020-2021లో సైన్స్ విభాగ డీన్‌గా, 2018-2020లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్‌గా, 2013-2014లో ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టా రు. అదనంగా ఆయన జువాలజీ విభాగాధిపతిగా, అడ్మిషన్స్ డైరెక్టర్‌గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా సేవలు అందించారు. 2016-2018 మధ్యకాలంలో ఆయన రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్యారసిటాలజీ డైరెక్టర్‌గా పనిచేశారు.
తన కెరీర్లో ప్రతాప్‌రెడ్డి అనేక ప్రతిష్ఠాత్మక అవార్డుల ను అందుకున్నారు. 2017లో తెలంగాణ ప్రభుత్వం నుం చి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2015లో యూజీసీ-బీఎస్ఆర్ మిడ్-కెరీర్ అవార్డును అందుకున్నారు. 1987లో ఎస్ఎస్ పర్మార్ ఫౌండేషన్ ప్రైజ్ లభించింది.
కాకతీయ యూనివర్సిటీ కొత్త వీసీ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డికి సమస్యలు స్వాగతం పలుకనున్నాయి. కేయూలో నెలకొన్న అధ్యాపకుల కొరత, పీహెచ్డీ అడ్మిషన్ల లొల్లి, కేయూ భూముల ఆక్రమణలు.. ఇలా అనేక సమస్యలను కొత్త వీసీ ప్రతాప్‌రెడ్డి ఎదుర్కోవాల్సి ఉన్నది. ఇప్పటికే మాజీ వీసీల అక్రమాలపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త వీసీ పనితీరు ఎలా ఉండబోతుందోనని అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులు, మేధావులు చర్చించుకోవడం విశేషం.