హనుమకొండ చౌరస్తా, జనవరి 19: సంక్రాంతి పండుగ ముగియడంతో తిరుగు ప్రయాణంలో ఆదివారం బస్సుల కోసం ప్రజలు పాట్లు పడ్డారు. గంటల తరబడి వేచి చూసి విసిగిపోయారు. వరంగల్ రీజియన్‌లోని పరకాల, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, నర్సంపేట, హనుమకొండ బస్స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. ప్రధానంగా హనుమకొండలో బస్సుల కోసం పడిగాపులు కాశారు. వరంగల్-హైదరాబాద్ రూట్లో జనం రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికారులు గ్రామీణ ప్రాంతాలకు నడుస్తున్న సర్వీసులను రద్దు చేయడంతో అక్కడి ప్రజలు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ములుగు, ఏటూరునాగారం, భూపాలపల్లి, నర్సంపేట, తొర్రూరు, పాలకుర్తి, ధర్మసాగర్, వరంగల్ సిటీ ప్రయాణికులు బస్సుల కోసం రోడ్ల మీద నిరీక్షించారు.
హైదరాబాద్ బస్సుల కోసం క్యూ
హనుమకొండ బస్‌స్టేషన్‌లోని హైదరాబాద్ పాయింట్ల వద్ద బస్సుల కోసం జనం క్యూ కట్టారు. సోమవారం విధుల్లో చేరడానికి వేలాదిగా ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఇతర ప్రైవేట్ ఉద్యోగులు హనుమకొండ బస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఒక్క ఆదివారం రోజే రాత్రి 8 గంటల వరకు ఎన్నడూ లేని విధంగా సుమారు 500 ట్రిప్పులు హైదరాబాద్ రూట్లో నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇవేకాకుండా హైదరాబాద్ మీదుగా బెంగళూర్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, శ్రీశైలం, మిర్యాలగూడ తదితర దూరప్రాంతాలకు రిజర్వేషన్ బస్సులు నడిపారు. వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ, అద్దె, సిటీ బస్సులు 930 ఉండగా, వీటిలో 254 బస్సులు హైదరాబాద్ రూట్‌కే కేటాయించారు.
చార్జీల మోత
తొర్రూరు, జనవరి 19 : సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సుల పేరుతో చార్జీల మోత మోగిస్తున్నారు. టికెట్ ధరకు అదనంగా వసూలు చేయడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బస్టాండ్‌లో పండుగకు వచ్చి తిరుగు ప్రయాణమైన ప్రజలు ధరల పెంపుపై ఆర్టీసీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తొర్రూరు నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్ వరకు పండుగకు ముందు రూ. 290 ఉన్న టికెట్‌ను ఇప్పుడు రూ. 420కు పెంచడంతో ఆగ్రహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూఏటా పండుగల సమయంలో టికెట్ ధరలు పెరగడం సాధారణమైనా, ఈ సారి పెంపు అధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంతో ప్రయాణం చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చవుతున్నదని, తమ సమస్యలను కూడా అధికారులు పట్టించుకోవాలని మండిపడ్డారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము పనిచేస్తామని, ప్రయాణికులు తమకు సహకరించాలని ఆర్టీసీ సిబ్బంది కోరారు.
660 ప్రత్యేక సర్వీసులు ప్రారంభించాం
సంక్రాంతి పండుగ సందర్భంగా 660 ప్రత్యేక సర్వీసులు ప్రారంభించాం. వరంగల్ రీజియన్ పరిధి నుంచి హైదరాబాద్‌కు ఆదివారం 254 అదనపు సర్వీసులు నడిపాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులు తిప్పుతున్నాం. ఆదివారం కావడంతో ప్రయాణికులు పెరిగారు.
– డీ విజయభాను, ఆర్ఎం