హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 1 : హనుమకొండ బస్‌స్టేషన్‌లో బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. బుధవారం నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ప్రకటించడంతో పాఠశాలల విద్యార్థులు, ప్రజలు సొతూళ్లకు వెళ్లేందుకు బస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో మంగళవారం బస్‌స్టేషన్ ప్రాంగణమంతా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.
అయితే ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల కొద్దీ బస్సుల కోసం ఎదురు చూశారు. అడపా, దడపా వచ్చిన బస్సులు ఎక్కేందుకు, సీట్లు దొరకబుచ్చుకునేందుకు నానా తంటాలు పడ్డారు. చిన్న పిల్లలను కిటికీల్లోంచి బస్సు లోపలికి పంపించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. అనవసరంగా ఓట్లేసి గెలిపించామని, మహాలక్ష్మీ పథకాన్ని ఎవరు పెట్టమన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.