భీమదేవరపల్లి, జూలై 18 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఏర్పాటు చేసిన ప్రజాగ్రంథాలయానికి పన్నెండేళ్లు నిండాయి. 2014లో ఆ గ్రామ పూర్వ విద్యార్థులు కలిసి దీని ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా, దినదిన ప్రవర్థమానంగా ఎదిగి ప్రజాగ్రంథాలయంగా ప్రసిద్ధికెక్కింది. కేవలం పుస్తకాలే కాకుండా డిజిటల్ వ్యవస్థగా రూపాంతరం చెంది విద్యార్థులకు విజ్ఞాన గనిగా మారింది. నిత్యం వందలాది మందితో కిటకిటలాడుతున్నది.
దీనికి తోడు ముల్కనూరు ప్రజా గ్రంథాలయం – నమస్తే తెలంగాణ దినపత్రిక భాగస్వామ్యంతో ఏటా జాతీయస్థాయిలో కథల పోటీల నిర్వహణతో ఈ గ్రంథాలయం రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన 1982-83 పదో తరగతి విద్యార్థులు ముందుగా స్పందన చారిటబుల్ ట్రస్టు, ఆ తర్వాత ప్రజాగ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుత సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాసులు ప్రధాన పాత్ర పోషించారు. దీనికి పలువురు ప్రజాప్రతినిధులు తమ సహకారాన్ని అందించారు.
ముందుగా అప్పటి కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ ఆదేశాలతో గ్రామం నడిబొడ్డున ప్రధాన రహదారి పక్కనే 8 గుంటల భూమిని కేటాయించారు. అప్పటి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ రూ.10లక్షల చొప్పున, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు రూ.5 లక్షలు కేటాయించగా, స్పందన చారిటబుల్ ట్రస్టు, ముల్కనూరు గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సభ్యులు మరో రూ.10లక్షలు సమకూర్చారు. వీటితో మంచి భవనాన్ని నిర్మించారు. దీనికి తోడు వేముల శ్రీనివాసులుతోపాటు ఇతరులు తమకున్న పరిచయాలతో పోటీ పరీక్షల కోసం అనేక రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రజాగ్రంథాలయాన్ని డిజిటలైజేషన్‌గా మార్చారు.
ముల్కనూరు సాహితీ పీఠం-నమస్తే తెలంగాణ దినపత్రిక సంయుక్తంగా ఏటా జాతీయస్థాయి కథల పోటీలను నిర్వహిస్తున్నది. ఇప్పటికే 2026 విజేతల ఎంపిక పూర్తయింది. ఆదివారం ప్రజాగ్రంథాలయంలో కథోత్సవం-2026 పేరిట విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరామ్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ శాసన సభ్యుడు వొడితల సతీశ్ కుమార్, అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రియాజ్, సుద్దాల అశోక్ తేజ, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, పాశం యాదగిరి, మారపల్లి సుధీర్‌కుమార్ హాజరుకానున్నారు.