ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుపై ప్రైవేట్ టీచర్లు భగ్గుమన్నారు. ‘ఇంటర్ పాసైన వాళ్లు.. డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్లు ప్రైవేట్ స్కూళ్లలో బోధిస్తున్నార’ని ఇటీవల ఒక సభలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధించే టీచర్లకు మీరిచ్చే గౌరవం ఇదేనా? ఇదేనా మీ సంస్కారం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎంతోమంది డిగ్రీలు, పీజీలు చేసి ప్రభుత్వ ఉద్యోగం దొరకక చాలీచాలని వేతనాలతో పనిచేస్తుంటే గౌరవం వేతనం పెంచాల్సింది పోయి ఇలా అవమానించేలా మాట్లాడడమేంటని మండిపడుతున్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల సీఎం వ్యాఖ్యలను వ్యతిరేకించగా ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని ఆర్ఎంసీ పాఠశాలలో శనివారం నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని నినాదాలు తెలిపారు.
– నమస్తే నెట్వర్క్, ఆగస్టు 3
గిర్మాజీపేట : ఎంతోమంది నిరుద్యోగ యువత డిగ్రీలు, పీజీలు, పలు శిక్షణ కోర్సులు పూర్తిచేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు లేక ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో జీవిస్తున్న తమపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరం. ఏ టీచరైనా విద్యార్థుల ఉన్నతికే పాటుపడుతారని తెలుసుకోవాలి. ప్రైవేట్ ఉపాధ్యాయులను కించపర్చడం సరికాదు.
– వడ్డెపల్లి మనుప్రసాద్ (ఎంఏ ఇంగ్లిష్, బీఈడీ) వరంగల్
గీసుగొండ : ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలకు క్యూకతున్నరు. ఈ విషయం సీఎం రేవంత్‌కు తెలియదా? తాము ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు దొరకక కుటుంబ పోషణ కోసం ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నం. తాము మంచి విద్య అందిస్తున్నందునే ఎన్ఐటీ, ఐఐటీ, అనేక పోటీ పరీక్షల్లో ర్యాంకులు వస్తున్నాయి. తమను తక్కువ చేసి మాట్లాడడం సరికాదు.
-బానోతు వీరన్న (ఉషాదయ హైస్కూల్ టీచర్, గంగదేవిపల్లి )
శాయంపేట: ప్రైవేటు ఉపాధ్యాయులతోనే గ్రామాల్లో విద్యా వ్యాప్తి జరుగుతున్నది. ప్రతి ఉపాధ్యాయుడు బీఈడీ, డీఈడీ చేసి, టెట్ అర్హత పొందిన వారే. పీజీలు చేసి ఉద్యోగాలు లేక ప్రైవేట్ పాఠశాలలో బోధిస్తున్నారు. రాష్ట్రం కోసం ఉద్యమించిన వారిని ప్రజా ప్రభుత్వం అవమానించడం బాధాకరం. హెల్త్‌కార్డులు, పీఎఫ్ వంటి కనీస సౌకర్యాలు లేకపోయినా విద్యార్థుల ఉన్నతి కోసం ప్రతి నిమిషం శ్రమిస్తున్నారు.
– మామిడి పృథ్వీ, ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు
వరంగల్ చౌరస్తా : ప్రైవేట్ ఉపాధ్యాయులను కించపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. సర్టిఫికెట్లు ఉంటేనే గురువులు కావొచ్చు, కానీ, విజ్ఞానం, సంస్కారాన్ని బోధించే ప్రతి వ్యక్తి గురువుతో సమానమే.ఈ వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగవు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నవారే ఉన్నత చదువులు చదువుకున్న వారైతే ఆయన కూతురిని ఏ ప్రభుత్వ పాఠశాలలో చదివించారో గుర్తుచేసుకోవాలి. ఎంతమంది ఉపాధ్యాయులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారో లెక్కచూసుకోవాలి.
– అంబటి రాధిక, వీనస్ హై స్కూల్ ఉపాధ్యాయురాలు, చింతల్