హనుమకొండ, మార్చి 26: హనుమకొండ వడ్డేపల్లి100 ఫీట్ల రోడ్డులోని వరంగల్ ఆర్వో కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల హవా కొనసాగుతున్నది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వారిని తీసివేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశించినా ఇక్కడ అమలుకాకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని కలిస్తే కాని పని అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. కార్యాలయ సిబ్బంది వెళ్లిన తర్వాత కంప్యూటర్ క్యాబిన్లో డాక్యుమెంట్ రైటర్లను కూర్చోబెట్టి డాక్యుమెంట్ ఫీడింగ్, క్యాప్చర్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఏమైనా ఫైళ్లుగానీ, డాక్యుమెంట్లు పోతే ఎవరు బాధ్యులని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. తాజాగా బుధవారం ఓ డాక్యుమెంట్ రైటర్ కంప్యూటర్ క్యాబిన్లో కూర్చొని డాక్యుమెంట్ ఫీడింగ్, ఫొటో క్యాప్చరింగ్ చేశాడు. ప్రభుత్వ ఉద్యోగులు నిర్వర్తించాల్సిన విధులు ప్రైవేట్ వ్యక్తులు చేయడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రైవేట్, డాక్యుమెంట్ రైటర్ల విషయంలో ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
ప్రైవేట్ వ్యక్తులను ప్రోత్సహిస్తున్న సబ్ రిజిస్ట్రార్లు
ఉద్యోగులు చేయాల్సిన పనులను సబ్ రిజిస్ట్రార్లు ప్రైవేట్ వ్యక్తులతో చేయించడంపై అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ విషయమై జిల్లా రిజిస్ట్రార్ ఫణీంద్రను ఫోన్లో సంప్రదించగా ప్రైవేట్ వ్యక్తులను తొలగించాలని ఇప్పటికే డీఐజీ, డీఆర్‌గా తాను చెప్పానన్నారు. అయినప్పటికీ మళ్లీ చెప్పి తొలగిస్తాం.
కంప్యూటర్ క్యాబిన్లో డాక్యుమెంట్ రైటర్ ఉన్న విషయం తెలియదు. విచార ణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా జాయింట్ -1 సబ్ రిజిస్ట్రార్ ఆనంద్‌ను సైతం ఫోన్లో సంప్రదించగా సాయంత్రం ఇంటర్నెట్ సమస్య వచ్చింది. నెట్ రాగానే డాక్యుమెంట్ పూర్తి చేశాం. రైటర్ కంప్యూటర్ క్యాబిన్లో ఉన్నట్లు నాకు తెలవడంతోనే వెంటనే పంపించి కార్యాలయ ఉద్యోగితో దస్తావేజుల ప్రక్రియ కొనసాగించాం. పాత ఫైల్స్ అన్ని అప్పగించిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులందరినీ తొలగించాం. ఇప్పుడు ఎవరూ లేరు.