కాజీపేట: కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న కార్మికుల కోసం ప్రైవేటుగా ఐటిఐ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కాజీపేట ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రావు కోరారు. కాజీపేటలో మంగళవారం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పరిధిలోని పరిశ్రమలలో మూడేళ్లు సర్వీస్ పూర్తి చేసిన అభ్యర్థులు ప్రైవేటుగా ఐటిఐ శిక్షణ పొందేందుకు వరంగల్ ఆర్డిడి కార్యాలయంలో ఈనెల 12 లోపు తగిన ఆధారాలను జత చేసి డ్రాయింగ్ అధికారిచే సర్టిఫైడ్ చేయించి దరఖాస్తు చేసు కోవాలన్నారు.
దరఖాస్తు కోసం వచ్చే అభ్యర్థులు తమ ఉద్యోగ ఐడీ, ఆధార్ కార్డు తీసుకొని రావాలన్నారు. రైల్వేలో ప్రభుత్వ, ప్రభుత్వేతర సెక్టార్లలో పనిచేసే వారికి ఈ ప్రైవేటు ఐటిఐ శిక్షణ ప్రమోషన్లు పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు ప్రైవేటుగా ఐటిఐ శిక్షణ పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.