వరంగల్, ఆగస్టు 5 : వరంగల్ నగరంలో స్మార్ట్‌సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించనున్నారు. ఈ మేరకు స్మార్ట్‌సిటీ బోర్డు అనుమతులు మంజూరు చేసింది. సోమవారం కుడా కార్యాలయంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ అధ్యక్షనత జరిగిన 27వ స్మార్ట్‌సిటీ బోర్డు సమావేశంలో బోర్డు సభ్యులు మేయర్ గుండు సుధారాణి, ఈఎస్సీ జియావుద్దీన్, గ్రేటర్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి ఆమోదించారు. గత ఎజెండాలో ఆమోదం పొంది కొనసాగుతున్న బయోమైనింగ్, స్మార్ట్‌సిటీ ఫేజ్ 1,2 పనులు, నాలాల పుణరుద్ధ్దరణ, రిటైనింగ్ వాల్స్, దసరా రోడ్డు, గవిచర్ల రోడ్డు, వడ్డేపల్లి, భద్రకాళీ బండ్ జోన్ డీ,
నయీంనగర్ హై లెవల్ బ్రిడ్జితో పాటు 19 పనులకు సంబంధించిన రెండో గడువును నవంబర్ 2024 వరకు, మూడో గడువును డిసెంబర్ 2024, మార్చి 2025 వరకు పొడిగిస్తూ బోర్డు ఆమోదించింది. స్మార్ట్‌సిటీ ద్వారా గతంలో మంజూరైన రెండు పనులకు అదనపు నిధులు మంజూరు, మరో అభివృద్ధి పనుల కాంట్రాక్ట్ వాల్యూ పెంచుతూ పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. అలాగే, గతంలో మంజూరు చేసిన నాలుగు అభివృద్ధ్ది పనులను రద్దు చేసి, వాటి స్థానంలో మరో నాలుగు అభివృద్ధి పనులకు బోర్డు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని కమిషనర్ వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వెంకట్‌రెడ్డి, కుడా పీవో అజిత్‌రెడ్డి, బల్దియా ఎస్ఈలు ప్రవీణ్‌చంద్ర, రాజయ్య, శ్రీనివాసరావు, స్మార్ట్‌సిటీ పీఎంవో ఆనంద్ వోలేటి పాల్గొన్నారు.
హనుమకొండ : కాళోజీ కళాక్షేత్రం పనులను ఈ నెల 20లోగా పూర్తి చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఆదేశించారు. సోమవారం వరంగల్‌కు వచ్చిన ఆయన మేయర్, కుడా చైర్మన్, హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ కమిషనర్‌తో కలిసి కాళోజీ కళాక్షేత్రం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు నిర్మాణ పనులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.అలాగే, కళాక్షేత్రంలో సీటింగ్ ఏర్పాట్లు, బాలనీ సీటింగ్‌లపై నిర్మాణ సంస్థ ప్రతినిధులకు కలెక్టర్ ప్రావీణ్య సూచనలు ఇచ్చారు. పనులను రోజూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. వారివెంట కుడా పీవో అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు తదితరులు ఉన్నారు.