గీసుగొండ, జనవరి 13: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 15, 16, 17 డివిజన్ల అభివృద్ధిపై మున్సిపల్ అధికారులతో హనుమకొండలోని ఆయన నివాసంలో శుక్రవారం ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా పనులు ప్రారంభమై పూర్తి కాని వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలసత్వంపై ఆయన అధికారులను ప్రశ్నించారు. ఇంకా మొదలు పెట్టని పనులను వారం రోజుల్లో ప్రారంభించాలని సూచించారు.
టెండర్ పక్రియలో ఉన్న పనులకు వెంటనే టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల విషయంలో అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గ్రామాల్లో శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అవసమైతే స్థానికులను పనుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. మున్సిపల్ స్వాగత తోరణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
రెడ్డిపాలెం సెంట్రల్ లైటింగ్ పనులను త్వరలో పూర్తి చేయాలని కోరారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమయ్యే పనుల్లో అధికారులు ఆలస్యం చేయొద్దన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని, అభివృద్ధి పనులకు నిధుల విషయంలో ఇబ్బందులు లేవని, పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులపై సమీక్షించాలన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు ఆకులపల్లి మనోహర్, సుంకరి మనీషా, గద్దె బాబు, డీఈ సంజయ్, రవికిరణ్, ఏఈలు కృష్ణమూర్తి, సంతోష్, పాల్గొన్నారు.