ములుగురూరల్, జూన్ 3: 2026లో జరగనున్న మేడా రం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళికతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ టీఎస్ దివాకరతో కలిసి అధికారులతో నిర్వహించిన సమీక్షలో మేడారం జాతర, వానకాలంలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
గత అనుభవాలను దృష్టిలో ఉం చుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటికే రూ.33 కోట్లతో రోడ్డు నిర్మాణ పను లు జరుగుతున్నాయని, మరో రూ.100 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల నిర్మాణం చేపట్టాలని, పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
వానకాలంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో 3 నెలలకు సరిప డా మందులు అందుబాటులో ఉంచుకోవాలని, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేపడుతూ అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేసి ప్రజలకు భరోసా ఇవ్వాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ డాక్టర్ పీ శబరీశ్, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఆర్డీవో వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు.