ఖిలావరంగల్, జూలై 24: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో 88 మంది వివిధ సమస్యలపై దరఖాస్తులు అందించారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ‘డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్’ విభాగంలో నూతనంగా భర్తీ చేసిన సిబ్బంది ఎంపిక విధానంలో పలు అక్రమాలు జరిగాయని ఎనుమాములకు చెందిన కల్పన, ఉషశ్రీ, శిరీష కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ధరణిలో దొర్లిన తప్పును సరి చేయాలని ఖిలావరంగల్‌కు చెందిని ఇట్నేని లక్ష్మీనారాయణ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అలాగే, తమకు థర్డ్ జెండర్‌గా గుర్తింపు కార్డు ఇవ్వాలని హిజ్రాలు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. భూ సమస్యలు 30, డిస్ట్రిక్ట్ ఎంప్లాయీమెంట్ తదితర విభాగాలకు సంబంధించి 58 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ పీ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సరైన వేదిక అని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్ యంత్రాల ద్వారా ఓటుహక్కు ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీవత్స కోట, వరంగల్ ఆర్డీవో వాసుచంద్ర, నర్సంపేట ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్డీఏ సంపత్‌రావు పాల్గొన్నారు.
టీకాలు తప్పని సరిగా వేయించాలి
ఇంద్రధనుష్ కార్యక్రమంలో భాగంగా రెండేళ్లలోపు పిల్లలు, గర్భిణులకు విధిగా టీకాలు వేయించాలని కలెక్టర్ పీ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్లో మిషన్ ఇంద్రధనుష్‌పై డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని ఒక ప్రణాళికా ప్రకారం షెడ్యూల్ తయారు చేసి, సంబంధిత అధికారులతో సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా రెండేళ్లలోపు చిన్నారులు, గర్భిణుల జాబితాను తయారు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో వ్యాక్సినేషన్ ఉంటుందన్నారు. వ్యాక్సినేషన్ వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరిగి ప్రమాదకరమైన జబ్బుల బారిన పడకుండా ఉంటారన్నారు. ముందుగా వరల్డ్ హెల్త్ ఆర్గనేజేషన్ సర్వలెన్స్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంతి, వాజంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ, డీఎంహెచ్‌వో డాక్టర్ కే వెంకటరమణ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మధుసూదన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రకాశ్, డీఈవో డీ వాసంతి, డీడబ్ల్యూవో శారద, డీఆర్డీఏ సంపత్‌రావు పాల్గొన్నారు.