జనగామ, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : జనగామ కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవం అదిరిపోవాలని, ఈమేరకు సముదాయాన్ని, పరిసరాలను పచ్చదనం ఉట్టిపడేలా తీర్చిదిద్ది ఏర్పాట్లు ఘనంగా చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 11న సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సమీకృత భవనాల సముదాయాన్ని సోమవారం జనగామ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యతో కలిసి మంత్రులు పరిశీలించి జిల్లా అధికారులకు సూచనలు చేశారు. పూజగది, సమావేశ మందిరం, భోజనాల ఏర్పాట్లు చేసే గదులు, మీటింగ్‌హాల్‌లో జిల్లా వైభవాన్ని తెలియజేసే ఫొటోలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ఫొటోలను సందర్శించారు. ప్రాంగణమంతా పచ్చదనం, పరిశుభ్రతతో ఉట్టిపడేలా పూల మొక్కలు కనిపించాలని ఆదేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే అతిథులను సాదరంగా ఆహ్వానించాలని, అతిథులకు భోజన, వసతి ప్రణాళిక ప్రకారం చేపట్టాలని ఆదేశించారు. భవన నిర్మాణ ముఖద్వారం, ప్రధాన రహదారి వైపు ఉండడంతో రంగులు వేసి అందంగా తీర్చిదిద్దాలని, ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. వంటల తయారీపై మంత్రులు ఆరా తీసి కొన్ని సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అబ్దుల్ హమీద్, భాస్కర్‌రావు, జడ్పీ సీఈ వో విజయలక్ష్మి, పీవో ఇస్మాయిల్, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీవోలు మధుమోహన్, కృష్ణవేణి, డీపీవో రంగాచారి, డీఈవో రాము, డీసీహెచ్ఎస్ సుగుణాకర్‌రాజు, పశుసంవర్ధక అధికారి నర్సయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ రవీందర్, డీఎస్వో రోజారాణి, జనగామ తహసీల్దార్ రవీందర్, కౌన్సిలర్ పగిడిపాటి సుధ పాల్గొన్నారు.
ఈ నెల 11న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్న టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సందర్శించారు. జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి ఇతర పార్టీ ముఖ్యులతో సమావేశమై సభా ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ పర్యటన ఖరారు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మున్సిపల్, ఆర్అండ్బీ యంత్రాంగం జిల్లాకేంద్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తోంది. స్వాగతం తెలిపేలా భారీ బెలూన్లు, రోడ్డుకు ఇరువైపులా అమర్చిన కటౌట్లతో జనగామకు నయాలుక్ వచ్చింది. జనగామ ఆర్టీసీ చౌరస్తా నుంచి సూర్యాపేట రోడ్డులోని కొత్త కలెక్టరేట్ వరకు డివైడర్ల మరమ్మతు పనులు చురుగ్గా సాగుతుండగా యశ్వంతాపూర్ వద్ద బహిరంగ సభా వేదిక పనులు మొదలయ్యాయి. అలాగే కొత్త కలెక్టరేట్ లోపల, బయట మిగిలిన పనులు పూర్తిచేయడంతో పాటు రోడ్డు మార్గాన్ని అద్దంలా మెరిసేలా తీర్చిదిద్దుతున్నారు. కొత్త కలెక్టరేట్ నుంచి చౌరస్తా, యశ్వంతాపూర్ మీదుగా లేదా సూర్యాపేట మార్గంలో నెల్లుట్ల బైపాస్ మీదుగా పార్టీ కార్యాలయానికి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. అయితే జనగామ నుంచి పార్టీ కార్యాలయం వరకు వెళ్లే రెండు రోడ్డు మార్గాల మధ్యలో ఉన్న ఏదైనా గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసే అవకాశం ఉన్నందున యశ్వంతాపూర్, నెల్లుట్లలో పల్లె ప్రకృతి వనాలను సరికొత్త హంగులతో ముస్తాబు చేస్తున్నారు. సీఎం బహిరంగ సభ వేదికతో పాటు బారికేడ్ల నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి.
జనగామ రూరల్, ఫిబ్రవరి 8 : సీఎం కేసీఆర్ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సీపీ తరుణ్‌జోషి, సీఎం సెక్యూరిటీ వింగ్ అధికారులు ఆదేశించారు. యశ్వంతాపూర్‌లోని బహిరంగ సభాస్థలాన్ని జిల్లా పోలీసు అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. సీఎం వచ్చే మార్గంలో ఎలాంటి అవాంతరాల్లేకుండా చూడాలని, ప్రజాప్రతినిధులు, ప్రజలు వచ్చే దారుల్లో ఇబ్బందులుండవద్దని వారు చెప్పారు. స్టేజీ పనులను కూడా త్వరగా పూర్తిచేసి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. బందోబస్తులో ఉండే ప్రాంతాలను గుర్తించి సిబ్బందిని కేటాయించాలన్నారు. సీఎం వచ్చే మార్గాలను గుర్తించారు. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డిని సభకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ డీసీపీ సీతారామ్, ఏసీపీ కృష్ణ, సీఐ బాలాజీ వరప్రసాద్, పోలీస్ అధికారులు, టీఆర్ఎస్ నాయకుడు చిట్ల ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.