హనుమకొండ, డిసెంబర్ 26 : కాంగ్రెస్ సర్కారులో కరెంటోళ్లు రుబాబు చేస్తున్నారు. యాసంగి ప్రారంభలోనే యూజర్ చార్జీల (కస్టమర్ సర్వీస్ చార్జీ) పేరిట అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఒక్కరు కట్టకున్నా అందరికీ సరఫరా బంద్ చేస్తున్నారు. సీఎండీ ఆదేశాల పేరిట ఎస్ఈ, డీఈ, ఏఈల ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యుత్ అంతరాయంతో నారు మడులు ఎండుతుండగా, ఏమీ చేయలేక రైతులు లబోదిబోమంటున్నారు.
కస్టమర్ యూజర్ చార్జీగా నెలకు రూ.30ల చొప్పున సంవత్సరానికి రూ. 360లు ఒక్కసారే వసూలు చేస్తారు. ఈక్రమంలో విద్యుత్ అధికారులు గ్రామాల్లో కొన్ని రోజులుగా నిత్యం వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించిన కరెంట్‌ను కట్ చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. గత ప్రభుత్వ పాలనలో ఇవి లేవని, ఇప్పుడు కోతలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో నీరందక నారు మడులు ఎండపోవడమే కాకుండా, దుక్కులు పొతం అయ్యే అవకాశం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ కనెక్షన్ల రైతులు కస్టమర్ సర్వీస్ చార్జీలు చెల్లిస్తేనే సప్లయ్ వస్తుంది. ఏ ఒక్కరు చెల్లించకున్నా సరఫరా నిలిపివేస్తున్నాం. ఎవరైనా కట్టని వారు ఉంటే వారు బాధ్యతగా మిగిలిన వారితో కట్టించేలా చేయాలి. చెల్లింపులు జరిగే వరకు ప్రతి రోజూ పొద్దటి పూట సరఫరా నిలిపి వేయాలని ఎన్పీడీసీఎస్ సీఎండీ ఆదేశాలిచ్చారు.
– తరుణ్, వర్ధన్నపేట ఏఈ
కస్టమర్ సర్వీస్ చార్జీలు వసూలు చేసే క్రమంలో వ్యవసాయ కనెక్షన్లకు అరగంట సప్లయ్ ఆపేస్తున్నాం. రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి చార్జీలు చెల్లించాలని చెబుతున్నాం. అయినప్పటికీ చాలా మంది కట్టడం లేదు. ట్రాన్స్ఫార్మర్ల వద్దకు రైతులను పిలిపించి మాట్లాడుతున్నాం.
– గౌతంరెడ్డి, ఎస్ఈ వరంగల్ సర్కిల్