టేకుమట్ల, మార్చి6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి శివారు కలికోటపల్లి-పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ గ్రామాల మధ్య మానేరు వాగులో పోసిన మట్టిరోడ్డుపై కొంతమంది దుండగులు జేసీబీతో గుంతలు తీశారు. మానేరు వాగులో ప్రైవేటు వ్యక్తులు టోల్ వసూలు చేయడాన్ని ఈ నెల 1న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో ప్రచురితమైన ‘దర్జాగా దారి దోపిడీ’ కథనానికి అధికారులు స్పందించి టోల్‌ను బంద్ చేయించారు.
మరుసటి రోజు కొంతమంది దొంగచాటుగా మళ్లీ వసూళ్లు మొదలు పట్టడంతో వాహనదారులు అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో వారిని తీవ్రంగా హెచ్చరించారు. దీంతో ఐదు రోజుల పాటు ఉచిత రవాణా కొనసాగింది. ఈ క్రమంలో ఉచిత ప్రయాణాన్ని జీర్ణించుకోలేని ప్రైవేట్ వ్యక్తులు మట్టి రోడ్డుపై గుంతలు తవ్వారు. దీంతో అంతర్ జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుపై గుంతలు తీసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు. కాగా, రోడ్డు తవ్విన వారిపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆగ్రహం వ్యక్తం చేసి, కలెక్టర్ రాహుల్ శర్మకు ఫోన్ చేసి, పెద్దపల్లి కలెక్టర్‌తో చర్చించి వాగులో ఉచిత రవాణా కొనసాగేలా చర్యలు చేపట్టాలని కోరినట్లు స్థానికులు తెలిపారు.
మానేరు వాగులో అనుమతులు లేకుండా నాసిరకంగా మట్టిరోడ్డుని పోసి ప్రైవేటు వ్యక్తులు టోల్ వసూ లు చేస్తుంటే ప్రభుత్వం, అధికారులు ఏం చేస్తున్నారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. అంతర్ జిల్లాలను కలిపే రోడ్డును ప్రభుత్వం పోయకపోవడమే కాకుండా, వంతె న నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పందించి వంతెన పనులు త్వరగా పూర్తి చే యించాలని, అప్పటి వరకు రోడ్డు పై ఉచిత రవాణా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.