ఆ వైద్యుడు పైసలు లేనిదే ఏ పనీ చేయడు. మృతదేహాలు, అనాథ శవాలైనా సరే జేబు తడపాల్సిందే.. ఎవరైనా సరే ‘సదా’ చెల్లించాలనడం ఆయన నైజం. లేకపోతే పోస్టుమార్టం నిర్వహించేది లేదు, రిపోర్టులు ఇచ్చేది లేదు. సాయంత్రం నాలుగు దాటితే రేటు డబుల్. ఇదీ ఎంజీఎం ఫోరెన్సిక్ విభాగంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ వైద్యుడి నిర్వాకం.
– వరంగల్‌చౌరస్తా, సెప్టెంబర్ 23
ప్రాణాలు పోసే పనికాకపోయినా ప్రాణాలు పోవడానికి కారణాలను వెతికే ఫోరెన్సిక్ విభాగంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వైద్యుడు డబ్బుల కోసం శవాలను సైతం ఏడిపించుకు తింటున్నాడు. వివిధ కారణాలతో చనిపోయిన వారు, అనుమానాస్పద మృతుల కారణాలు తెలుసుకోవడానికి పైసా లేనిదే పనిచేసేది లేదు, నివేదికలు ఇవ్వనంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. సాధారణంగా ప్రతి వైద్యుడికి ఉదయం నుంచి సాయంత్రం వరకు విధి నిర్వహణ ఉంటుంది.
కానీ, ఈ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ మాత్రం హంటర్‌రోడ్డులోని ఓ కార్పొరేట్ దవాఖానలో పనిచేస్తూ మధ్నాహ్నం 3 గంటలకు విధులకు హాజరవుతున్నాడు. అప్పటి వరకు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసులు శవ జాగారణ చేయాల్సిందే. అయినా పోస్టుమార్టం చేస్తాడా అంటే అదీ కష్టమే.. ముడుపులు ఇవ్వనిదే పరీక్షలు చేసేది లేదు.. రిపోర్టులు రాసేది లేదు. సాయంత్రం నాలుగు దాటితే చాలు రేటు డబుల్ చేస్తున్నాడు.
ఇటీవల 12వ తేదీన ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ పరిధి నుంచి వచ్చిన ఎంఎల్సీ (మెడికో లీగల్ కేస్)లో ఓ వ్యక్తి ఎంజీఎంహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందగా, వైద్యాధికారులు పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. అయితే సదరు వైద్యుడు రూ.ఐదు వేలు ఇస్తేకాని పోస్టుమార్టం నిర్వహించనని మొండికేయడంతో ఆ వ్యక్తి బంధువులు మంత్రి సీతక్కతో ఫోన్ చేయించినప్పటికీ రూ.రెండు వేలు ముట్టజెప్పనిదే పనికాలేదు.
ఇటీవల ఓ కేసు విషయంలో మహిళా కానిస్టేబుల్ విధినిర్వహణలో భాగంగా మార్చురీకి వచ్చింది. తనకు ఫార్మాలిటీ లేనిదే పోస్టుమార్టం నిర్వహించేదిలేదనడంతో తాను ఇవ్వనని తేల్చి చెప్పింది. దీంతో పోలీసుల పర్యవేక్షణలోనే పోస్టుమార్టం నిర్వహిస్తానని, తన వెంట లేనిదే పోస్టుమార్టం చేయనని సదరు వైద్యుడు చెప్పడంతో ఆమె పోస్టుమార్టం గదిలోకి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురైంది. మరో కేసులో రిపోర్టుల కోసం వచ్చిన కానిస్టేబుల్‌ను అసభ్యకరంగా దూషించినట్లు తెలిసింది.
ఆయన విధుల్లో ఉంటే రిపోర్టులు స్వీకరించడానికి పోలీసులు సైతం చదివింపులు చేపట్టాల్సిందే. లేదంటే కాళ్లు అరిగేలా తిరగాల్సిందే. ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించిన ఓ కేసు విషయంలో రిపోర్టు కోసం ఎస్సై స్థాయి అధికారి వెళితే పోలీసులు నమోదు చేసిన కేసు విషయంలో రూ.ఐదు వేలు డిమాండ్ చేయడంతో చెల్లించడానికి పోలీసులు విభేదించారు. దీంతో విచారణకు సంబంధించిన వివరాలతో కూడిన ఫైల్ తీసుకువస్తేనే రిపోర్టు ఇస్తానని ఇబ్బందులు పెట్టడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
అనాథ శవాలు, గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందిన సందర్భాల్లో మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచి, మూడు రోజుల తరువాత పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుంది. దానికి సైతం డబ్బులు డిమాండ్ చేస్తుండడంతో ఆయన విధుల్లో లేని రోజుల్లో పోలీసులు అనాథ శవాలకు పోస్టుమార్టం చేయిస్తున్నారు. ఆ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ వసూళ్ల దాహానికి తోటి ఫోరెన్సిక్ విభాగం వైద్యులే మండిపడుతున్నారు. ఇప్పటికైనా సదరు అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు కోరుతున్నారు.