హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 8: ఓసీలంతా ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట్ర ఓసీ జేఏసీ అధ్యక్షుడు గోపు జయపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వారు సభ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయపాల్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ, రాష్ట్రస్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి షరతులు లేని 5 సంవత్సరాల కాలపరిమితి కలిగి ఉండాలన్నారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్య,ఉద్యోగంలో పోటీ పరీక్షల వయోపరిమితి పెంచాలని, ఓసీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు టెట్ పరీక్ష అర్హతను 90 నుంచి 70 మార్కుల వరకు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఓసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, ఈ డిమాండ్ల సాధన కోసం జనవరి 11న సాయంత్రం 3 గంటలకు ఆర్ట్ కాలేజీ గ్రౌండ్లో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఓసీలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని జయపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్, కోశాధికారి నడిపెల్లి వెంకటేశ్వర్రావు, రాష్ట్ర సలహాదారు రావుల నర్సింహారెడ్డి, మార్వడి సంఘం అధ్యక్షుడు మాందాడి వేణుగోపాల్, కమ్మ సంఘం అధ్యక్షుడు రాయపాటి వెంకటేశ్వర్రావు, అయినవోలు మల్లికార్జునశాస్త్రీ, బోయినపల్లి పాపారావు, చందుపట్ల నర్సింహారెడ్డి, అల్లాడి వీరభద్రయ్య, వల్ల రాజిరెడ్డి, చకిలం రాజిరెడ్డి, రాజు, గుండ రభాకర్ పాల్గొన్నారు.