వనపర్తి, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : ‘నేను చెత్త కనిపిస్తే సహించను.. అన్ని ప్రాంతాల్లోనూ పరిశీలనకు వస్తా.. మున్సిపాలిటీలు పరిశుభ్రంగా ఉండాలి.. లేనిపక్ష్యంలో అధికారులపై చర్యలు తీసుకుంటాను’.. అంటూ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి మున్సిపాలిటీల్లోని చెత్తపై మాట్లాడిన మాటలివి.. హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లను దృష్టిలో ఉంచుకొని సమీక్షలో ఇలా మా ట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ క్రమంలో వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్యం పూర్తిగా లోపించి ప్రధాన రహదారులన్నీ మురికి కూపాలుగా మారిన నేపథ్యంలో అధికారులు ఎలా స్పందించి పారిశుధ్య చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..
వనపర్తి పట్టణంలోని ప్రధాన రోడ్ల చివరలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. మున్సిపల్లో పాలక వర్గాల గడువు ముగిసిన అనంతరం కార్యాలయంలో అధికారులది ఆడిందే ఆట పాడిందే పాటగా మారడంతో.. ఎప్పుడు ఎవరు వస్తున్నారో..? పోతున్నారో? కూడా తెలియని గందరగోళం ఏర్పడింది. ఒకరిద్దరు ఉద్యోగులు అంతా తామే అన్నట్లు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అత్యంత సుందరంగా ఉండాల్సిన జిల్లా కేంద్రం దుర్గంధ భరితంగాతయారైంది. ఇటీవల ఏర్పాటైన నూతన పాలకవర్గాన్ని మున్సిపల్లో సక్రమంగా పని చేయని ఉద్యోగులు, ప్రధాన సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులు ఉండగా.. లక్షా 15 వేలకుపైగా జనాభా ఉన్నది. అయితే శానిటరీ విభాగంలో కొనసాగుతున్న పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోజు విడిచి రోజు చెత్త సేకరణ వార్డుల వారీగా జరుగుతున్నా.. అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్న ఆరోపణలు లేకపోలేదు. చెత్త సేకరణలో 29 వాహనాలను ఉపయోగి స్తున్నారు. వీటిలో 13 ట్రాక్టర్లు, మరో 4 ఆటోలు ప్రభుత్వ వాహనాలు ఉన్నాయి. మరో 11 ప్రైవేట్ ఆటోలను కూడా వినియోగిస్తున్నారు. 17 వార్డుల్లో ప్రభుత్వ వాహనాల ద్వారా.. మరో 16 వార్డుల్లో ప్రైవేట్ ఆటోల ద్వారా చెత్త సేకరణ చేస్తున్నారు.
ప్రధాన రోడ్లన్నీ దుర్గంధమే..
పట్టణంలోని ప్రధాన రోడ్ల పరిసరాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఎక్కడ చూసినా చెత్తనే దర్శనమిస్తున్నది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి చెత్త స్వాగతం పలుకుతోంది. డంపింగ్ యార్డును తలపించడంతోపాటు దుర్వాసన వెదలజల్లుతుంది. పెబ్బేరు, పాన్‌గల్, గోపాల్పేట, ఖిల్లాఘణ పురం రోడ్ల సమీపంలో అనధికారికంగా చెత్త డంపింగ్ చేస్తున్నారు. దీంతో ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక్కడ చెత్త వేసే వారిలో ప్రైవేట్ వారితోపాటు మున్సిపాలిటీ వారు ‘సందట్లో సడేమియా’ అన్నట్లు ఇక్కడే దొబ్బి వెళ్తున్నారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే జేసీబీతో చెత్త కనిపించకుండా సిబ్బంది చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఈ మార్గాల ద్వారా వెళ్లే ప్రజలు, వాహనదారులు ముక్కు మూసుకొని వెళ్తున్నారు.
డంపింగ్ యార్డున్నా..
మున్సిపాలిటీకి నాగవరం శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. అయితే.. రోజు వాహనాలు ఇక్కడకు వెళ్లి చెత్త పారబోయాలి. కొన్ని వాహనాలు మధ్యలో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే.. అక్కడే పారబోయడం పరిపాటిగా మారింది. ప్రధాన రోడ్ల కూడళ్లతోపాటు మధ్యలోనూ అనేకం ఎక్కడ పడితే అక్కడ చెత్త డంపింగ్లే దర్శనమిస్తున్నాయి. మున్సిపల్లోని 33 వార్డుల ద్వారా ప్రతి రోజు 30 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతుందన్న అంచనా ఉన్నది. ఈ మేరకు వాహనాలు, సిబ్బంది ఉన్నా శానిటరీ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో చెత్త సేకరణ పకడ్బందీగా లేకుండా పోయిందన్న విమర్శలు వెలువడుతున్నాయి.
కొత్త పాలకవర్గానికి..
నూతనంగా ఏర్పడిన కొత్త మున్సిపల్ పాలకవర్గానికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఒక్క చెత్త సేకరణలోనే కాదు ఇతర విభాగాల్లోనూ చాలా సమస్యలు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ చెర్మన్‌గా బీ మాధవి, వైస్ చైర్మన్‌గా మధుసూదన్‌గౌడ్ ఎన్నికైన సంగతి విధితమే. వీరిలో చైర్మన్‌గా ఎంపికైన మాధవికి కొత్తగా పదవి రావడంతో వీరిని వెనుకుండి నడిపించాల్సిన పరిస్థితి ఉంటే.. వైస్ చైర్మన్‌కు కొంత వరకు అవగాహన ఉన్నది. దీంతో కొంత సమయం గడిస్తే తప్పా.. మున్సిపాలిటీపై కొత్త పాలకవర్గం పట్టు సాధించే అవకాశం ఉంది. సగానికి పైగా కొత్త మొఖాలు వార్డు సభ్యులుగా మున్సిపాల్టీలోకి రాజకీయ అరంగేట్రం చేశారు. వ్యాపారంలో ఆరితేరిన చైర్మన్ మాధవి కుటుంబం రాజకీయంగానూ సమస్యపై పట్టు సాధిస్తారా? లేదా? అన్నది త్వరలోనే తేలనుంది.
స్పందించని శానిటరీ ఇన్స్పెక్టర్
పట్టణంలో ఎక్కడ పడితే అక్కడే చెత్త డంపింగ్ అవుతున్నది. దీనిపై వాట్సాఫ్‌లో ఫొటోలు పెట్టినా అధికారులు స్పందించడం లేదు. రోడ్లను అనుసరించి డంపింగ్ చేస్తున్న చెత్త గురించి వివరణ కోరేందుకు మున్సిపాలిటీలో ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్కు ‘నమస్తే తెలంగాణ’ పోన్ చేసినప్పటికీ స్పందించడం లేదు. చెత్త సమస్యలపై పట్టణ ప్రజలు అనేక దఫాలు ఫోన్లో సంప్రదించినా సదరు అధికారి నిర్లక్ష్యం చేస్తున్నాడని విమర్శలు వెలువడుతున్నాయి.
దుర్వాసన వెదజల్లుతోంది..
ప్రధాన రోడ్లను అనుసరించి వేసిన చెత్త డంపింగ్‌లతో ప్రయాణం చేసినప్పుడల్లా దుర్వాసన వెదజల్లుతున్నది. చూసేందుకు చాలా అసహ్యం గా కనిపిస్తుంది. ఇలా రోడ్లను అనుసరించి చెత్త వేయడం సరైన పద్ధతి కాదు. జిల్లా కేంద్రానికి వివిధ పనులపై వచ్చే వారికి, ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారికి చెత్తనే మొదటగా స్వాగతం పలికినట్లుగా అనిపిస్తున్నది. ఇలా రోడ్లను అనుసరించి చెత్త పారవేయకుండా అధికారులు దృష్టి పెట్టాలి. కొత్త పాలకవర్గం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది.
– వినయ్‌కుమార్, పాత కోట, వనపర్తి
చెత్తతోనే బీమారి బారిన పడ్డా..
ఎన్నిసార్లు చెప్పినా సారోళ్లు పట్టించుకోరు.. చెత్త వేయొద్దని మొత్తుకున్నా వినరు. కొందరు కాలనీ వాసులు రాత్రి పూట తెచ్చి వేస్తున్నారు. పగటీల వాహనాలతో మున్సిపాలిటీ వాళ్లు చెత్త పడేస్తున్నారు. ప్రైవేట్ భూమిలో వేయొద్దని చెప్పినా పట్టింపు లేదు. ఎప్పుడో ఒకసారి జేసీబీతో సిబ్బంది వచ్చి చెత్తను చదును చేస్తున్నారు. చచ్చిపోయిన కుక్కలు, కోళ్ల కళేబరాలను ఇక్కడ పారేయడంతో దుర్గంధం వెదజల్లుతోంది. నేను బీమారి బారిన పడ్డా. ఇదే రోడ్డులో ఉన్న పెట్రోల్ పంపులో వాచ్‌మెన్‌గా పని చేస్తా. మీకు దండం పెడతా.. ఇక్కడ చెత్తవేయకుండా చూడండి.
– కృష్ణయ్య, పాన్‌గల్ రోడ్డు, వనపర్తి