ఎల్కతుర్తి, మే 23 : సర్కార్ బడుల్లో చదువుకునే పిల్లలకు అందించే దుస్తుల్లో నాణ్యత కొరవడింది. చిరిగిన జేబులు, గల్లాలు, ఊడిపోయిన గుండీలు, బెల్ట్ పట్టీలతో తొడుక్కున్న మూణ్ణాళ్లకే పాడవుతున్నాయి. దీంతో కుట్టిన ఆ యూనిఫామ్స్‌ను రెండు నెలలు తిరక్కముందే తల్లిదండ్రులు మళ్లీ కుట్టిస్తున్నారు. విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టే పనిని మండల మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం అప్పగించింది. అయితే, ఒక డ్రెస్ కుడితే వచ్చే కూలీ చాలా తక్కువగా ఉండడంతో యూనిఫామ్స్ కుట్టేందుకు మహిళలు ముందుకు రావడం లేదు. వచ్చిన కొద్దిమంది కూడా రోజు వారీ కూలీ గిట్టుబాటు కాకపోవడంతో ఆదరాబాదరా కుడుతున్నారనే ఆరోపణలున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు పాఠశాలలకు యూనిఫామ్స్ అందించాలనే నిబంధనకు తోడు కుట్టే డ్రెస్‌లు ఎక్కువగా ఉండడం, కుట్టే వారు తక్కువగా ఉండడంతో నాణ్యత కొరవడుతుందని ఉపాధ్యాయలు, తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఒకటి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా, సోషల్ వెల్ఫేర్, మోడల్ స్కూళ్లలో అయితే ఇంటర్ వరకు చదువుకునే బాలబాలికలకు ఏడాదికి రెండు జతల చొప్పున ప్రభుత్వం యూనిఫామ్స్ అందజేస్తున్నది. ఇది వరకు విద్యాశాఖ ద్వారా ఏజెన్సీలకు డ్రెస్‌లు కుట్టే టెండర్‌ను అప్పగించేవారు. రెండేళ్ల క్రితం ఈ పనిని మహిళా సంఘాలకు కేటాయించారు. ఇందులో భాగంగా జిల్లాకు ఐదుగురు చొప్పున మహిళా సంఘాల్లో పనిచేసే మహిళలకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. వీరు మండలానికి కొందరు చొప్పున మడికొండలోని మహిళా ప్రాంగణంలో ఆసక్తి ఉన్న మహిళలకు శిక్షణ ఇచ్చారు. గత విద్యా సంవత్సరం వీరు విద్యార్థులకు యూనిఫామ్స్‌ను కుట్టి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు.
విద్యార్థులు, విద్యార్థినులు ఎవరికైనా డ్రెస్ కుడితే రూ.75 చొప్పున ఇస్తున్నారు. అయితే, వీరిలో కొందరికి బటన్స్ వేయడం, కాజాలు పెట్టడం వంటి పనులు రాకపోవడంతో కుట్టిన డ్రెస్‌లను వేరే వారికి ఇచ్చి ఈ పనులు చేయిస్తారు. ఒక్కో డ్రెస్‌కు కేటాయించిన రూ.75లో కొలతలు తీసుకున్న తర్వాత క్లాత్ కట్ చేసిన వారికి, రవాణా చార్జి, బటన్స్, కాజా, చైన్లు వేసిన వారికి, మండల సమాఖ్యకు సర్వీస్‌చార్జి, కుట్టిన డ్రెస్‌ల క్వాలిటీ చెక్ చేసిన వారికి ఇలా కలిపి మొత్తం రూ.25 ఖర్చవుతున్నాయి. ఇవన్నీ పోను డ్రెస్ కుట్టిన మహిళలకు మిగిలేది రూ.50 మాత్రమే. అయితే, ధర తక్కువగా ఉండడం, ఆదరాబాదరాగా దుస్తులు కుడుతుండడంతో అవి నాణ్యత తగ్గి మూణ్ణాళ్లకే చినుగుతున్నాయనే ఆరోపణలున్నాయి.
యూనిఫామ్స్ చినగడం చూడలేని కొంత మంది ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తామూ కొన్ని డబ్బులు కలిపి నాణ్యతగా విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టిస్తున్నారు. అలాగే దుస్తులు చిరగడం, గుండీలు ఊడిపోతుండడంతో తల్లిదండ్రులు మళ్లీ ఆ దుస్తులనే తీసుకెళ్లి సొంత డబ్బులతో డబుల్ స్టిచ్చింగ్ వేయిస్తున్నారు. యూనిఫామ్స్ కోసం సరఫరా చేసే క్లాత్ కూడా క్వాలిటీగా ఉండడం లేదని, రెండో కుట్టు వేస్తే చినిగిపోతున్నదని తల్లిదండ్రులు చెబుతున్నారు. యూనిఫామ్ కుడితే ఇచ్చే కూలీని మరింతగా పెంచాలని మహిళలు కోరుతున్నారు. ఈసారైనా పంపిణీ చేసే యూనిఫామ్స్ మీద ఉన్నతాధికారులు దృష్టి సారించి విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్స్ అందేలా చూడాలని అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు కోరుతున్నారు.