స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 18: ఎమ్మెల్యే కడియం శ్రీహరిని పది మందిలో ప్రశ్నించినందుకు తనకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని బాధితుడు పొన్నం రాజయ్య అన్నాడు. ఇటీవల జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం చాగల్లు గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. కాగా, తనకు ఇల్లు లేదని, నాడు టీడీపీ, బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్లో మీరే ఉన్నారు. ఇప్పటికైనా ఇల్లు ఇప్పించండి అని పొన్నం రాజయ్య అందరి ముందు అడిగినందుకు కాంగ్రెస్ శ్రేణులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తనను లబ్ది దారునిగా ఎంపిక చేయలేదని రాజయ్య ఆరోపించారు.
మొదటగా ఇందిరమ్మ అర్హుల జాబితాలో తమ పేరు ఉందని చెప్పిన కాంగ్రెస్ శ్రేణులు, కడియంను మీరు వివిధ పార్టీలు మారారని ప్రశ్నించిన తర్వాత తన పేరు మిస్ అయ్యిందని, అడిగితే రెండవ జాబితాలో వస్తుందని చెప్పారని అన్నారు. సోమవారం ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ తోపాటు మున్సిపాలిటీ ఇంచార్జ్ కనకం గణేష్, యూత్ నియోజకవర్గ ఇంచార్జ్
మారపల్లి ప్రసాద్ బాబు, యూత్ మండల అధ్యక్షుడు గుండె మల్లేష్ చాగల్లులో శిథిలావస్థలో ఉన్న రాజయ్య ఇంటిని పరిశీలించారు.
ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ..ప్రస్తుతం తన భార్యతో పెంకుటిల్లు పై పాలిథీన్ కవర్లు కప్పుకొని జీవనం సాగిస్తున్నాడని, ఇల్లు శిథిలావస్తుకు చేరుకుందని తెలిపారు. ఇల్లు సరిగా లేకపోవడంతో కూతురు, అల్లుడు, కొడుకు ఇంటికి రావడం లేదని, చిన్న కుమారుడి వివాహం జరగడం లేదని రాజయ్య ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వారం రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి ఇల్లు ఎప్పుడు కూలుతుందో తెలియక భయం గుప్పింట్లో ఉంటూ రాజయ్య జీవితం కొనసాగిస్తున్నాడని తెలిపారు. ఇప్పటికైనా సంబధిత అధికారులు వెంటనే స్పందించి అర్హుడైన రాజయ్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.