వరంగల్,మార్చి 28 : పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌ను వేగవంతం చేయాలని, బేస్మెంట్ లెవల్ పూర్తయిన ఇండ్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో వరంగల్ స్మార్ట్‌సిటీ పనులు, సూపర్ సెష్పాలిటీ హాస్పిటల్, ఇందిరమ్మ ఇండ్లు, తాగునీటి సరఫరా,అంశాలపై ఆయన మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం రా ష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని, దీనిని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్లు పనిచేయాలని సూ చించారు. ఇందిరమ్మ ఇండ్లకు ప్రభు త్వం నాలుగు విడుతల్లో బిల్లులు చెల్లిస్తుందన్నారు. మొదటి విడుత బేస్మెంట్ పూర్తయిన వెంటనే రూ.లక్ష, బేస్మెంట్ పూర్తయిన తర్వాత ఇళ్ల వివరాలను ప్రభుత్వానికి పంపిస్తే చెల్లింపులు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఇంటి స్థలాలు లేని అర్హులైన వారికి ఇప్పటి వరకు కేటాయించని డబుల్ బెడ్రూం గృహాలను కేటాయించాలని అధికారులను ఆదేశించారు.
వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రానున్న మూడు నెలలు అత్యంత కీలకమని, తాగునీటి ఇబ్బందులు ఉన్నాయన్న విమర్శలు రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, తర్వాత మరో నెల రోజుల్లో వైద్య సేవలకు అవసరమైన పరికరాలను అమర్చాలన్నారు. జూన్ నాటికి దవాఖానను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు.
మడికొండలోని డంపింగ్ యార్డుకు ప్రస్తుతం తాత్కాలిక పరిష్కారం చూపి, తర్వాత శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. వరంగల్, కరీంనగర్ రహదారి మధ్యలో డంపింగ్ యార్డు కోసం 150 నుంచి 200 ఎకరాల భూమిని సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. భద్రకాళీ చెరు వు పూడికతీత పనులు వానకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, యశస్వినీరెడ్డి, దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, మురళీనాయక్, రామచంద్రూనాయక్, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బస్వరాజు సార య్య, నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ పాల్గొన్నారు.