జనగామ, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ)/కృష్ణకాలనీ : జనగామ, భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల విధులకు హాజరైన పోలింగ్ సిబ్బంది బుధవారం రాత్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద మెరుపు ధర్నాకు దిగారు. తమకు రెండు రోజుల విధుల నిర్వహణకు ఎన్నికల సంఘం నిర్దేశించిన రెమ్యునరేషన్లో కోత విధించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఓపీవోలకు రెండురోజులకు రూ.1,300 చెల్లించాల్సి ఉండగా, రెండుపూటలా భోజనం చార్జీల పేరుతో తమకు చెల్లించే రెమ్యునరేషన్లో రూ.500 కోత పెట్టి రూ.800 చెల్లించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇతర జిల్లాల్లో రెండు రోజుల విధులకు రూ. 1300 చెల్లిస్తే తమకు మాత్రం కోత పెట్టడం ఏమిటని అధికారులను నిలదీశారు. తమకు కోత లేకుండా మొత్తం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు రెమ్యునరేషన్ అందించామని, సందేహాలుంటే కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ తెలపడంతో అక్కడి పోలింగ్ సిబ్బంది ఆందోళనను విరమించారు.