నర్సంపేట, నవంబర్ 30: నియోజకవర్గంలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 87.89శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని సెంటర్లలో 5గంటల తర్వాత కూడా ఓటర్లు బారులుతీరి ఉన్నారు. మహిళలు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వరంగల్, హైదరాబాద్, ఇతర పట్టణాల్లో ఉంటున్న యువత తరలివచ్చారు. యువత, వృద్ధులు, దివ్యాంగులు, తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులను కుటుంబ సభ్యులు, పార్టీలకు చెందిన వ్యక్తులు ఆటోల్లో తీసుకువచ్చి ఓట్లు వేయించారు. దుగ్గొండి మండలంలోని తండాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ముందుజాగ్రత్తగా పోలీసులు పలుచోట్ల 144 సెక్షన్ విధించారు.
నర్సంపేట రూరల్: మండలంలో గురువారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించగా నిమిషాలు ఆలస్యమైంది. ఆతర్వాత వేగం పుంజుకుంది. సాయంత్రం 5గంటల వరకు ఓటర్లు బారులు తీరి ఓటు వేశారు. మహేశ్వరం 145వ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సిబ్బంది ఈవీఎంను సరిగా ఆపరేట్ చేయకపోవడంతో అరగంట ఆలస్యమైంది. మహిళలు, వృద్ధులు, యువత పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దివ్యాంగులను అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఇతర సిబ్బంది వీల్చైర్లలో పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లి ఓటు వేసిన తర్వాత తీసుకెళ్లారు. నూతనం ఓటు హక్కు వచ్చిన యువత ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురిజాల పోలింగ్ కేంద్రం ఎదుట ఘర్షణ జరిగింది. పోలీసుల జోక్యంతో సద్దు మనిగింది. నర్సంపేట ఏసీపీ పుప్పాల తిరుమల్, నర్సంపేట టౌన్ సీఐ సుంకరి రవికుమార్, రూరల్ సీఐ కిషన్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలీస్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు.
నెక్కొండ: మండలంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నెక్కొండ, రెడ్లవాడ గ్రామాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోగా ఎస్సై అదుపులోకి తీసుకువచ్చారు. మండలంలోని అలంకానిపేట, బొల్లికొండ, దీక్షకుంట, నెక్కొండ గ్రామాల్లో ఓటేసేందుకు ప్రజలు బారులు తీరారు. రెడ్లవాడలో సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారికి ఓటేసేందుకు ఇచ్చారు. రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. పత్తిపాకలో ఈవీఎం పనితీరు నెమ్మదించడంతో ఓటేసేందుకు వచ్చిన ఓటర్లు, అధికారులు ఇబ్బందులు పడ్డారు. మడిపెల్లిలో 1,328 ఓట్లుండగా రాత్రి 9.30 గంటల వరకు, నాగారంలో, రెడ్లవాడలో 8గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఓటింగ్ ముగిసే సమయంలో అధిక సంఖ్యలో ఓటర్లు రాగా ఈ పరిస్థితి ఎదురైంది. పత్తిపాకలో 254 పోలింగ్ బూత్‌లో లావుడ్య నీలమ్మ ఓటేసేందుకు వెళ్లగా అప్పటికే ఆమె ఓటు ఎవరో వేసి వెళ్లారు. తనకు ఓటేసే అవకాశం కల్పించాలంటూ ఆమె కోరింది. పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు ఈవీఎంలను తరలించే వాహనం ముందు బైఠాయించింది. ఎస్సై జానీపాషా పరిస్థితిని అదుపులోకి తీసుకొని ఈవీఎంలను అక్కడి నుంచి తరలించారు. మండల కేంద్రంలోని 247వ పోలింగ్ బూత్‌లో ఉమ్మగాని పూజ ఓటేసేందుకు వెళ్లగా ఆమె ఓటును అంతకుముందే మరొకరు వేశారు. ఎవరో దొంగ ఓటు వేయడంతో తాను ఓటేయలేకపోతున్నానని అధికారులు, పోలింగ్ ఏజెంట్లను ఆమె ప్రశ్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
మండల కేంద్రంతోపాటు మండలంలోని పలు కేంద్రాల్లో పోలింగ్ సరళిని బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పనులు గెలిపిస్తామని, గతంలో కంటే మెజార్టీ పెరగడం ఖాయమన్నారు. కాగా, రెడ్లవాడలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు నియోజకవర్గ పోలింగ్ ఏజెంట్‌గా వచ్చిన జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్నను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించాయి. దీంతో వారిని బీఆర్ఎస్ శ్రేణులు నిలువరించాయి. ఈ క్రమంలో ఘర్షణ జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు దాడిచేసేందుకు యత్నించాయని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
ఖానాపురం: మండలంలో పోలింగ్ 7 గంటలకు ప్రారంభం కాగా 10 గంటల నుంచి పుంజుకుంది. అన్ని గ్రామాల్లో మహిళలు, మొదటిసారి హక్కు వారు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపారు. ఖానాపురం, బుధరావుపేట, ధర్మరావుపేట, అశోక్‌నగర్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఖానాపురం, బుధరావుపేట, అశోక్‌నగర్ గ్రామాల్లో పోలింగ్ సమయం తర్వాత గంటసేపు పోలింగ్ కొనసాగింది. బుధరావుపేట, మంగళవారిపేట, వేపచెట్టుతండాలో పోలింగ్ సరళిని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. నర్సంపేట ఏసీపీ తిరుమల్, దుగ్గొండి సిఐ పుల్యాల కిషన్, ఎస్సై మాధవ్‌ల గట్టి బందోబస్తు నిర్వహించారు.
చెన్నారావుపేట: మండల వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఎన్నికల పోలింగ్‌లో మండలంలోని ధర్మతండాలో చిన్న తోపులాట మినహా మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు పూర్తిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు మండల ఎన్నికల అధికారి ఫణికుమార్ తెలిపారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారని, యువత ఎక్కువ సంఖ్యలో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
నల్లబెల్లి: పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని 30వేల 457 ఓటర్లు కాగా, మహిళలు 15వేల 422, పురుషులు 15వేల 35 ఉన్నారు. 38 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. మూడుచెక్కలపల్లిలో గంట పాటు ఈవీఎం మొరాయించడంతో ఓటర్లు ఎండలో పడ్డారు. పలు పోలింగ్ బూత్‌లలో తక్కువ సంఖ్యలో ఎన్నికల అధికారులను నియమించడంతో మందకొడిగా సాగింది. ఏసీపీ తిరుమల్, సీఐ పుల్యాల కిషన్, ఎస్సై నైనాల నగేశ్ ఆధ్వర్యంలో పోలింగ్ బూత్‌ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.