ములుగురూరల్, అక్టోబర్13 : మేడారం సమ్మక-సారలమ్మ జాతర అభివృద్ధి పనుల్లో కమిషన్లు, కాంట్రాక్టుల కోసమే మంత్రులు, పాలకులు హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. అభివృద్ధి పనుల్లో చోటు చేసుకుంటున్న అవకతవకలు, కాంట్రాక్టర్ల కమిషన్లు, మంత్రుల మధ్య బహిరంగ టెండర్ల రగడపై ఆమె ఆందోళన వ్యక్తం చేసి మాట్లాడారు. రూ. 71 కోట్ల విలువైన టెండర్ల విషయంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల మధ్య విభేదాలు, ఫిర్యాదులతో అక్రమాలు బయటపడడం వారి దోపిడీకి నిదర్శనమన్నారు.
పనుల కేటాయింపు లో పెత్తందారులు, పెట్టుబడిదారుల జోక్యం పెరి గి సమ్మక-సారలమ్మ పౌరుషాన్ని, కుమ్రం భీం వారసత్వాన్ని ప్రశ్నించే విధంగా కేవలం లాభార్జన జాతరగా మార్చే ప్రక్రియ నడుస్తుందని అన్నారు. ఆదివాసీల ఆచారాలు, సంప్రదాయా లు, పూజారుల సలహాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో టెండర్లు, పనుల కేటాయింపులో ఆదివాసీ సంఘాలు, పూజారులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయమని పేర్కొన్నా రు. ఈ దోపిడీని ప్రశ్నించకపోతే రాబోయే తరాలకు మేడా రం జాతర అస్తిత్వం, పవిత్రత ప్రశ్నార్థకంగా మిగులుతుందని నాగజ్యోతి అన్నారు. ఇప్పటికైనా మేడారం అభివృద్ధి పనుల టెండర్లపై వెంట నే ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మంత్రుల జోక్యాన్ని నియంత్రించి, పనులు సకాలంలో నాణ్యతతో జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల భాగస్వామ్యంతో మాస్టర్ ప్లాన్ అమలు, పనుల పర్యవేక్షణలో ఆదివాసీ పూజారులు, సంఘాల ప్రతినిధులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మేడారం జాతరకు రూ.150 కోట్లు నిధులు తెచ్చామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప అభివృద్ధి ఎకడా కనబడడం లేదని ఆమె ప్రభుత్వంపై మండిపడ్డారు. జాతర సమీపిస్తున్నా ఇంత వరకు పనులు ప్రారంభం కాకపోవడం, 90 రోజుల్లో పనులు సాధ్యమయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.