ములుగు : అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి మాటూరి సాంబయ్య అనే మిర్చి రైతు అప్పుల బాధ భరించ లేక మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పురుగుమందు డబ్బా పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో నుంచి వెళ్లి పోయాడు. దీంతో సాంబయ్య భార్య 100 కు డయల్ చేయగా సమాచారం అందుకున్న ఎస్ఐ తాజుద్దీన్ కానిస్టేబుల్స్‌ను అప్రమత్తం చేశాడు. కాగా, మిర్చి కల్లాం వద్ద పురుగు మందు డబ్బా పట్టుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నిస్తుండగా పోలీసులు గుర్తించారు.
వెంటనే అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఎస్ఐ కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి అప్పుల బాధ కోసం ఆత్మహత్య చేసుకుని నిండు జీవితాన్ని నాశనం చేసుకోవ్దని సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మాటూరి సాంబయ్య ఈ ఏడాది రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేశాడు. గత ఏడాది కూడా రెండున్నర ఎకరాలు మిర్చి సాగు చేయగా నష్టం వాటిల్లింది. వరుసగా రెండు సంవత్సరాల నుంచి మిర్చి పంట నష్టపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.