వరంగల్ కమిషరేట్‌లోని తూర్పు నియోజకవర్గంలో పోలీసు అధికారులు హద్దు మీరుతూ.. అతి చేస్తున్నారు. వీరి తీరు తరచూ విమర్శలకు దారి తీస్తున్నది. పేదలు, సామాన్యులు, వ్యాపా రులు, ఉద్యోగులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, చివరికి అధికార పార్టీలోని వారినీ వేధిస్తున్నారు. తాజాగా ఓ రౌడీషీటర్‌తో అంటకాగుతున్న ఏసీపీ ఈసారి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడితో దురుసుగా ప్రవర్తించాడు. కేసు పెడతా, కొడతా అని బెదిరిస్తూ ఓవరాక్షన్ చేశాడు. ఖాకీల తీరుతో ఇబ్బంది పడుతున్నామని, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.
– వరంగల్, డిసెంబర్21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోలీ సు అధికారులు అతి ఉత్సాహం చూపుతున్నా రు. సామాన్యులపై అమర్యాదగా వ్యవహరిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఇటీవల యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మంత్రి కొండా సురే ఖ ప్రత్యర్థి వర్గం వారు గెలిచారనే కారణంతో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జూపల్లి వెంకటరత్నం అధికార పార్టీ కార్యకర్తలను వే ధించాడు. ఇప్పటికే పలుసార్లు వివాదాస్పదం గా మారిన వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ మరోసారి ఇదేరకంగా వ్యవహరించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వాణిజ్య వ్యవహారాలకు ప్రాతినిథ్యం వహించే వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి విషయంలో ఏసీపీ నందిరాంనాయక్ అతి గా వ్యవహరించడంతో పోలీసు అధికారులపై విమర్శలు పెరుగుతున్నాయి. చాంబర్ ఆఫ్ కామర్స్‌తో అనుబంధం ఉన్న ఓ వ్యాపారి విషయంలో మధ్యవర్తిత్వం వహించినందుకు పో లీసులు బొమ్మినేని రవీందర్రెడ్డిపైనే కేసు న మోదు చేశారు.
ఆ తర్వాత వరంగ ల్ ఏసీపీ నందిరాంనాయక్ తన ఆఫీసుకు పిలిపించి ఇక్కడ కూర్చోవద్దని, ఒకింత దురుసగా వ్యవహరించారు. వ్యాపారుల ప్రతినిధితో ఏసీపీ ఇలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మా రింది. ఏడాదిగా రౌడీ షీటర్ ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ వ్యాపారుల ప్రతినిధితో ఇలా వ్యవహరించడం సరికాదని వరంగల్ తూర్పు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏసీసీ తీరు మొదటి నుంచీ ఇలాగే ఉంటున్నది, ఈయన పరిధిలోని పోలీస్ స్టేషన్లలో బాధితుల కంటే మాజీ రౌడీ షీటర్ చెప్పిన వారికే పోలీసులు వత్తా సు పలుకుతున్నారని చెప్పుకుంటున్నారు.
వరంగల్ ఏసీపీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి
కాశీబుగ్గ: అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వర్గానికి కొమ్ము కాస్తున్న ఏసీపీ నందిరాంనాయక్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డితో పాటు కార్యవర్గ సభ్యులను మట్ట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అవమానించిన ఏసీపీ నందిరాం నాయక్ తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు.
మంత్రి సురేఖ భర్త కొండా మురళీధర్ ఎవరిపై కేసులు పెట్టాలని చెప్తే వారిపై ఏసీపీ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. వేలాది మంది వ్యాపారులకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న రవీందర్‌రెడ్డిని అవమానించడం మంచి పద్ధతి కాదని అన్నారు. మట్టెవాడ, ఇంతేజార్గంజ్, మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో అమాయక ప్రజలను పోలీసులు వేధిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇకనైనా ఏసీపీతో పాటు పోలీస్ సిబ్బంది తమ వైఖరిని మార్చుకోవాలని బీజేపీ తరపున డిమాండ్ చేశారు.
ఇదీ విషయం..
వరంగల్‌లోని ఓ వ్యాపారికి చెందిన భవనం జేపీఎన్ రోడ్డులో ఉన్నది. ఇటీవల దీన్ని విక్ర యించారు. భవనం రిజిస్ట్రేషన్ కోసం అందులో ఉంటున్న వ్యాపారులు ఖాళీ చేయించాల్సి ఉన్న ది. ఓ వ్యక్తి ఖాళీ చేయకుండా యజమానికి లీగల్ నోటీసు ఇచ్చినట్లు తెలిసింది. యజమానితో కలిసి బొమ్మినేని రవీందర్‌రెడ్డి ఆ వ్యాపారితో కలిసి భవనం వద్దకు వెళ్లి మాట్లాడరని, ఆ ప్రక్రియ లో చిన్నపాటి వాదులాట జరగిందని సమాచారం. అనంతరం కిరాయిదారుడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తున్న మాజీ రౌడీ షీటర్‌ను సంప్రదించాడు. అతడి ఆదేశాల మేరకు కిరాయిదారుడు భవనం యజమాని, బొమ్మినేని రవీందర్‌రెడ్డి, వీరితో వెళ్లిన మరో వ్యాపారిపైనా ఇంతెజార్గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. వెంటనే కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ ముగ్గురు వ్యాపారులు వెళ్లి ఏసీపీని కలవాలని ఆదేశించారు.
అక్కడి నుంచి ముగ్గురు వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ చాంబర్లోకి వెళ్లిన తర్వాత కూర్చునే క్రమంలో రవీంద్‌రెడ్డితో ఏసీపీ దురుసుగా, అమర్యాదగా మాట్లాడారు. కేసు పెడతా, కొడతా అని బెదిరించడంతో ఆయన మనస్తాపంతో వెంటనే అక్కడి నుంచి మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి దగ్గరకు వెళ్లాడు. వరంగల్ తూర్పులోని పోలీసుల తీరు, ముఖ్యంగా వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ దురుసు ప్రవర్తనపై వివరించారు. పోలీసుల తరపున తాను క్షమాపణ కోరుతు న్నానని కొండా మురళి రవీందర్‌రెడ్డితో చెప్పినట్లు తెలిసింది. తూర్పు నియోజకవర్గంలోని ఏసీపీ, ఇన్స్పెక్టర్లు పదేపదే వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నా ఉన్నతాధికారులు వారిపై చర్యల విషయంలో స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పోలీసుల తీరుతో సామాన్యులు, వ్యాపారులు అందరూ ఇబ్బంది పడుతున్నారని, ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
అవమానం జరిగిన వారినే అడగండి: ఏసీపీ నందిరాంనాయక్
చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి విషయంలో ఏసీపీ నందిరాంనాయక్ను వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా… ‘అవమానం జరిగిందని చెప్పిన వారినే అడగండి. ఇక్కడ ఏం జరిగిందో వాళ్లే చెబుతారు. దీనిపై నేను ఏమీ చెప్పలేను’ అని అన్నారు.