వరంగల్, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వరంగల్ లీగల్/సుబేదారి : పదో తరగతి హిందీ పేపర్ లీకేజీలో వ్యవహారంలో బండి సంజయ్ కుట్ర దాగి ఉన్నట్లు స్పష్టమైంది. ఈమేరకు విచారణ జరిపిన పోలీసులు ప్రధాన నిందితుడు(ఏ1)గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రెండో నిందితుడి(ఏ2)గా మాజీ జర్నలిస్టు బూరం ప్రశాంత్, మూడో నిందితుడిగా కేఎంసీలో ల్యాబ్ అసిస్టెంట్ గుండెబోయిన మహేశ్, నాలుగో నిందితుడి(ఏ4)గా మౌటం శివగణేశ్, ఐదో నిందితుడి(ఏ5)గా మైనర్ బాలుడు ఉన్నట్లు పోలీసుల విచారణలో తే లింది. అందరిపైనా 120బీ, 420ఐపీసీ, 447, 505(1) ఐపీసీ సెక్షన్లలో కేసులు నమోదు చేశారు. మైనర్‌ను జువనైల్లో, మినహా నలుగురిని హనుమకొండ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. మొదటి నలుగురు కీలక నిందితులకు జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బుధవారం రోజంతా ఈ కేసులో కీలక పరిణామాలు జరిగాయి. టెన్త్ హిందీ పేపరు లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్ర ఉన్నదని పోలీసుల విచారణలో స్పష్టంగా తేలింది.
సర్కారును అప్రతిష్టపాలు చేయాలనే..
లీకేజ్ పేరుతో రాష్ర్ట ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఈ కుట్రకు తెరతీసినట్టు స్పష్టమవుతున్నది. ప్రశ్నపత్రం బయటికి వచ్చే ఒకరోజు బండి సంజయ్, ప్రశాంత్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది. ఆ వివరాలను వరంగల్ సీపీ వెల్లడించారు. ‘హిందీ పరీక్ష ముందురోజు సాయంత్రం బూరం ప్రశాంత్ బండి సంజయ్‌తో వాట్సాప్ చాట్ చేశాడు. ఇది ఉద్దేశ పూర్వకంగానే జరిగింది. హిందీ పేపర్‌ను ప్రశాంత్ చాలామందికి ఫార్వార్డ్ చేశాడు. మహేశ్ కూడా పంపాడు. వీరిద్దరు బండి సంజయ్‌కి పంపారు. ప్రశాంత్ అదే రోజు 11.18 గంటలకు హైదరాబాద్‌లో మీడియా హెడ్స్‌కు సెండ్ చేశాడు. 11.24 గంటలకు బండి సంజయ్‌కి ఫార్వార్డ్ చేశాడు. సోమవారం సాయంత్రం బండి సంజయ్‌తో ప్రశాంత్ వాట్సాప్ చాటింగ్ చేశాడు. వాట్సాప్ కాల్స్ మాట్లాడుకున్నారు. ప్రశాంత్ సోమవారం వాట్సాప్‌లో పంపిన విషయాలనే వెంటనే బండి సంజయ్ ప్రెస్మీట్లో మాట్లాడాడు. ప్రశాంత్ వాట్సాప్‌లో పెట్టిన విషయాలను బండి సంజయ్ కొద్దిసేపటికే ప్రెస్మీట్లో చెప్పాడు. మరుసటి రోజు పేపర్లలో అవే అంశాలు వచ్చాయి. బండి సంజయ్, ప్రశాంత్ వాట్సాప్ కాల్లో చాలాసార్లు మాట్లాడారు. లీకేజీ అని విసృ్తతంగా ప్రచారం చేయాలని ప్లాన్ చేశారు. ప్లాన్ చేశాడు కాబట్టే బండి సంజయ్‌ని ప్రధాన నిందితుడిగా పెట్టాము. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే కుట్రతోనే చేశారు’ అని వరంగల్ పోలీసు కమిషనర్ ఎ.వి.రంగనాథ్ వెల్లడించారు. బండి సంజయ్ బెయిల్ కోసం అయన తరపు న్యాయవాదులు జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
బండి వాహనంపైకి చెప్పులులీకేజీ వ్యవహారం నిందితులను పోలీసులు జిల్లా కోర్టుకు తరలించే సమయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బండి సంజయ్‌ని కోర్టుకు తీసుకొస్తారనే సమాచారంతో బీజేపీ పార్టీ నాయకులు కోర్టు వద్దకు చేరుకున్నారు. పిల్లల భవిష్యత్తును ఆగం చేసేలా వ్యవహరించిన బండి సంజయ్ కోర్టుకు వస్తుండగా వాహనంపై యువకులు చెప్పులు విసిరారు. కాన్వాయ్ వెంట పరుగెత్తి డౌన్ డౌన్ సంజయ్, తెలంగాణ ద్రోహి అంటూ నినాదాలు చేస్తూ చెప్పులు విసిరారు. కాగా బీజేపీ నాయకులు పలువురు ఉద్దేశపూర్వకంగా పోలీసులతో గొడవకు దిగారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లే విధంగా రెచ్చిపోయి పోలీసులను నెట్టివేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
పెంబర్తిలో బండి అరెస్ట్
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కరీంనగర్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి శాంతిభద్రతల దృష్ట్యా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు విచారణలో భాగంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు బండి సంజయ్‌ని జనగామ జిల్లా పెంబర్తి వద్ద అరెస్ట్ చేశారు. అక్కడినుంచి పాలకుర్తికి తరలించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మడికొండ పోలీసు శిక్షణ కళాశాల తీసుకువచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు హనుమకొండ జిల్లా కోర్టుకు తీసుకువచ్చారు.