పోలీసులు మోసగాళ్ల భరతం పడుతున్నారు. చీటర్స్‌ను అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి పంపుతున్నారు. తాజాగా బీమా కుంభకోణంపై దృష్టిసారించిన వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. ఇన్సూరెన్సు స్కాంపై విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. అనారోగ్యంతో ఉన్న వారి పేర వివిధ ఇన్సూరెన్సు కంపెనీల్లో బీమా చేసి, వారు చనిపోయిన అనంతరం క్లెయిమ్ అయ్యే మొత్తాన్ని ఈ ముఠా సభ్యులు తీసుకున్నట్లు వినికిడి. వరంగల్, మహబూబాబాద్, ములుగు, హనుమకొండ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ముందస్తు అవగాహనతోనే ఈ కుంభకోణం జరిగిందని తెలుస్తోంది.
వరంగల్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : వరంగల్ పోలీసులు మోసగాళ్ల ఆట కట్టిస్తున్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మెరిట్ మార్కులతో ఇంజినీరింగ్ వంటి సర్టిఫికెట్లు తయారు చేసి ఇచ్చిన నకిలీ ముఠాను కొద్ది నెలల క్రితం పట్టుకుని కటకటాల్లోకి పంపారు. అంతకుముందు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలితో కలిసి ఇక్కడ నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన భూపాలపల్లి జిల్లా వ్యక్తిని అరెస్టు చేశారు. సదరు వ్యక్తితోపాటు అతడికి సహకరించిన మహిళపైనా పీడీ యాక్టు అమలు చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని వరంగల్‌లో పలువురి నుంచి రూ.కోట్ల డబ్బు వసూలు చేసిన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన మరో వ్యక్తిని కూడా పట్టుకుని అతడిపై కూడా పీడీ యాక్టు నమోదు చేశారు. ఎంబీబీఎస్ డాక్టర్ అవతారం ఎత్తిన ఓ చీటర్‌ను ఇటీవల వరంగల్‌లోని చింతల్లో అరెస్టు చేశారు. బీ ఫార్మసీ చదివిన అతడు తాను ఎంబీబీఎస్ చేశానని చెప్పి చింతల్లో హాస్పిటల్ నిర్వహించి ప్రజలను మోసం చేశాడని ప్రకటించారు. చికిత్స కోసం తన వద్దకొచ్చిన రోగులను ఈ శంకర్‌దాదా ఎంబీబీఎస్ కమీషన్ పద్ధతిన కార్పొరేట్ హాస్పిటల్స్‌కు పంపినట్లు కూడా విచారణలో పోలీసులు గుర్తించారు. ఇలాంటి చీటర్స్తో పాటు వరంగల్ పోలీసులు నకిలీల భరతం పడుతున్నారు. ఇటీవల వరంగల్‌లో నకిలీ బీడీలు, ఆయిల్ తయారీదారులను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకొన్నారు. తాజాగా ఓ చీటింగ్ టీం బీమా కుంభకోణంపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ స్కాంలో పాత్రధారులైన టీం సభ్యుల్లో పలువురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న టీంలోని ఇతర సభ్యుల కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. విచారణలో బీమా కుంభకోణంపై విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం.
అసలేమి జరిగింది?
విశ్వసనీయ సమాచారం ప్రకారం జిల్లాలోని ఓ వ్యక్తి పలు ఇన్సూరెన్సు కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకున్నాడు. కొన్నేళ్ల నుంచి అతడితో పాటు ఈ బృందంలోని ఏజెంట్లు అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించారు. అనారోగ్యంతో ఉన్న వారిలో ముఖ్యంగా తమకు తెలిసిన వారి పేర ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణం తీసుకుని వాహనాలు కొనుగోలు చేశారు. పరిస్థితులను బట్టి అవసరమైతే కొద్ది నెలలు ఈఎంఐ(వాయిదా) డబ్బు చెల్లించారు. కొంతకాలం తర్వాత వాహనం యజమాని చనిపోగానే సంబంధిత ఇన్సూరెన్సు కంపెనీ నుంచి బీమా క్లెయిమ్ చేసుకున్నారు. వాహనానికి సంబంధించింది ఫైనాన్స్ కంపెనీకి పోగా, మరణించిన యజమాని పేర ఇన్సూరెన్సు కంపెనీ చెల్లించే బీమా మొత్తాన్ని ఈ టీంలోని సభ్యులు తీసుకున్నారు.
వాహనం కొనుగోలు చేసిన సమయంలో వాహనంతో పాటు కొనుగోలుదారుపై కూడా ఇన్సూరెన్సు చేస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో వాహనం యజమాని నామినీగా టీం సభ్యులు తమ పేరు పెడుతున్నట్లు తెలిసింది. అనారోగ్యంతో ఉన్న వారి కుటుంబ సభ్యులతో ముందుగా అవగాహన కుదుర్చుకుని ఈ వ్యవహారం చేసినట్లు సమాచారం. ఇలా ఒక పథకం ప్రకారం ఈ టీం సభ్యులు పలు వాహనాలను రుణంతో కొనుగోలు చేసి చనిపోయిన వారి పేర ఇన్సూరెన్సు కంపెనీల నుంచి క్లెయిమ్ చేసిన డబ్బును పెద్ద మొత్తంలో పొందినట్లు తెలిసింది. ఈ స్కాంపై మరో కథనం కూడా వినపడుతోంది. అనారోగ్యంతో ఉన్న వారి పేర వివిధ ఇన్సూరెన్సు కంపెనీల్లో బీమా చేసి వారు చనిపోయిన అనంతరం క్లెయిమ్ అయ్యే మొత్తాన్ని ఈ టీం సభ్యులు తీసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్, మహబూబాబాద్, ములుగు, హనుమకొండ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ముందస్తు అవగాహనతోనే బీమా కుంభకోణం జరిగిందని, చనిపోయిన వారిపేర ప్లాన్ ప్రకారం టీం సభ్యులు పెద్ద మొత్తంలో బీమా కంపెనీల నుంచి డబ్బు డ్రా చేసుకున్నారని పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది.
స్కాం పాత్రధారుల గుర్తింపు
బీమా స్కాంపై విచారణ చేపట్టిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఈ స్కాంలో పాత్రధారులను పలువురిని గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధ, గురువారం కొందరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో వివిధ మండలాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఒక మండలంలో 8 మందిని అదుపులోకి తీసుకోవడం తీవ్ర చర్చనీయమైంది. ఈ 8 మందిలో కీలక పాత్రధారి కూడా ఉన్నట్లు తెలిసింది. బీమా స్కాంలో పాత్రధారులైన మరికొందరిని కూడా పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. బీమా స్కాం ఎలా జరిగింది?, దీనికి పాల్పడిన వ్యక్తులు ఇన్సూరెన్సు కంపెనీల నుంచి చనిపోయిన వారి బీమా మొత్తాన్ని ఎలా డ్రా చేశారు, ఈ వ్యవహారంలో మొత్తం ఎంతమందికి పాత్ర ఉంది, వారిలో ఎవరెవరు ఉన్నారు అనే వివరాలను ఒకటి రెండు రోజుల్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.