అధికార పార్టీ పెద్దల డైరెక్షన్లో బీఆర్ఎస్ సభకు మొదటినుంచీ అడ్డంకులు సృష్టిస్తూనే వచ్చారు. ప్రతిష్టాత్మక సభ కావడంతో లక్షలాదిగా జనం తరలివస్తారనే అంచనాలుండడంతో ముందుగానే దరఖాస్తు చేసినా కుట్రలతో అనుమతి ఇచ్చేందుకూ కాలయాపన చేయడమే గాక ఎప్పుడూ లేని విధంగా వరంగల్ నగర పరిధిలో ‘సిటీ పోలీస్ యాక్ట్’ తీసుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చివరకు హైకోర్టు జోక్యంతో తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతి ఇచ్చి.. సభ రోజున 1100మంది పోలీసులు ఉంటారని సీపీ ప్రకటించినప్పటికీ బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యం కనిపించింది.
పేరుకు వెయ్యి మంది అని చెప్పినా క్షేత్రస్థాయిలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం, లారీలు అడ్డుపెట్టడం, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడంలో నిర్లక్ష్యం.. ఇంకొందరైతే మొక్కుబడిగా డ్యూటీ చేయడం, సభా గ్యాలరీలోకి ప్రజలను కావాలనే పంపకపోవడం.. ఇలా అనేక కారణాలు పోలీసుల ఘోర వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. పోలీసుల నిర్వాకం ఫలితంగా ఆదివారం లక్షలాది మంది ఎల్కతుర్తి సభకు వచ్చి, వెళ్లేటప్పుడు నగర నలుదిక్కులా ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కుపోయి గంటలకొద్దీ నరకం చూడాల్సిన పరిస్థితి రాగా.. అటు పోలీసులు తీరు, కాంగ్రెస్ సర్కారు కుట్రలపై ప్రజానీకం దుమ్మెత్తి పోస్తోంది.
– సుబేదారి, ఏప్రిల్ 28
ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ప్రతిపక్ష పార్టీ సభకు అధికార పక్షం పెద్దల డైరెక్షన్లో పోలీసు అధికారులు మొదటినుంచీ అడ్డంకులు సృష్టించారు. అయినా ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేశారు. వరంగల్‌లో రజతోత్సవ సభ నిర్వహిస్తామని అధినేత కేసీఆర్ ప్రకటించగానే అధికార పార్టీ పెద్దలు కుట్రలకు తెరలేపారు. పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ మార్చి 28న వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో సభ అనుమతి కోసం దరఖాస్తు చేయగా ఇవ్వకుండా అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల పాటు సిటీ పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని, అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించొద్దని ఈ నెల 5న ఉత్తర్వులు జారీచేశారు. దీంతో 9న దాస్యం హైకోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 12న సీపీ సభ అనుమతి దరఖాస్తును పరిశీలిస్తున్నామని ప్రకటన విడుదల చేయడంతో పాటు మరుసటి రోజు అనుమతి మంజూరు చేశారు.
సభ బందోబస్తు విషయమై పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించారు. 1100 మంది పోలీసులు విధుల్లో ఉంటారని సీపీ అధికారికంగా ప్రకటించినప్పటికీ ఎక్కడ కూడా డ్యూటీ చేసినట్లు కనిపించలేదు. స్టేజీ వద్ద ఓ డీసీపీ, మరో అదనపు డీసీపీ విధుల్లో ఉన్నారు. 8మంది ఏసీపీల్లో ఒకరు స్టేజీ మీడియా గ్యాలరీ వెనుక ఉండగా, మిగతా వారు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు.
ఇక ఇద్దరు ఏసీపీలైతే సిద్దిపేట రూట్లో రోడ్డుపైకి లారీలు వదిలి సభకు వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. మరో ఏసీపీ, నలుగురు ఇన్స్పెక్టర్లు సిద్దిపేట వైపు నుంచి వచ్చే ప్రజలు సభా ప్రాంగణం ఎడమ వైపు రోడ్డుకు దగ్గరగా ఉన్న గ్యాలరీలోకి రాకుండా బారికేడ్లు అడ్డుపెట్టారు. దీనిని గుర్తించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వారిని గ్యాలరీలోకి పంపాలని పదే పదే మైకులో అభ్యర్థించినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వెళ్లి బారికేడ్లను తెరిపించారు.
సభ ముగిసిన తర్వాత తమ గమ్యస్థానాలకు వెళ్లే ప్రజలు పోలీసుల పట్టింపులేని తనంతో అనేక ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలు ముందుకు వెళ్లకపోవడంతో పార్కింగ్లోని వా హనాలు రోడ్డుపైకి రాలేకపోయాయి. రోడ్డుపై నిలిచిన వాహనాలను పోలీసులు క్లియర్ చేయకుండా చేతులెత్తేయడంతో అర్ధరాత్రి వరకు ప్రజలు ట్రాఫిక్‌జామ్‌లో నే చిక్కుకున్నారు.
బీఆర్ఎస్ నాయకులు, వలంటీర్లు వచ్చి ట్రాఫిక్‌ను చక్కదిద్దడంతో వాహనాలు ముందు కు వెళ్లాయి. కాగా, సభకు హాజరైన ప్రజల నుంచి పోలీసులు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. బందోబస్తు నుంచి ట్రాఫిక్ క్లియర్ చేయడం వరకు ఏ ఒక్క పోలీ సు అధికారి పట్టించుకోలేదని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లే కారణమని దుమ్మెత్తిపోశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కుట్రలు చేసినా సభ ఆగలేదని, లక్షలాది మంది జనం హాజరై విజయవంతం చేశారని, దటీజ్ కేసీఆర్ అంటూ కొనియాడారు.
వరంగల్, సిద్దిపేట, కరీంనగర్ రూట్లలో సాయం త్రం 5 గంటల నుంచి సభకు వచ్చే వాహనాలు 10 నుంచి 15కిలోమీటర్ల వరకు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. సిద్దిపేట రూట్లో పోలీసులు లారీలకు అనుమతి ఇవ్వడంతో వందలాది వాహనాలు ముందుకు కదలలేదు. ఇటు వరంగల్ రూట్లో హసన్‌పర్తి మీదుగా ఔటర్ రింగ్‌రోడ్డు వరకు నిలిచిపోయాయి. చాలామంది పోలీసులు ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేయకుండా తమ వాహనాల్లోనే కూర్చున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ, ములుగు, పరకాల, వరంగల్ సిటీ, హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి వచ్చిన వాహనాలు ఔటర్ రింగ్‌రోడ్డు పై నుంచి ఎల్కతుర్తి వరకు నిలిచిపోయినా ఏ ఒక్క పోలీసు అధికారి పట్టించుకోలేదు.