కరీమాబాద్, అక్టోబర్ 21: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లావ్యాప్తంగా అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా మామునూరులోని నాలుగో బెటాలియన్, పోలీస్ ట్రేనింగ్ కళాశాలలో కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి, పీటీసీ కళాశాల ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ పోలీసు అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఎందరో పోలీసు అమరవీరుల త్యాగ ఫలితంగానే మనం సంతోషంగా జీవిస్తున్నామని, వారి త్యాగాలు వృథా కాకూడదన్నారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ కమాండెంట్ నరేందర్‌రెడ్డి, పీటీసీ, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌హౌస్ నిర్వహించారు. పట్టణ పరిధిలోని పాఠశాలల విద్యార్థులను స్టేషన్‌కు తీసుకొచ్చి వారికి పోలీసు విధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై రామారావు, స్టేషన్ జవాన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వరంగల్ 3వ డివిజన్లోని పైడిపల్లి బస్‌స్టాఫ్ వద్ద జై జవాన్.. జై కిసాన్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసు అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జన్ను షీభారాణి మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివన్నారు. వారి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. క్లబ్ చైర్మన్ ఇట్యాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కంది రాజేందర్, నాయకులు కునుమల్ల సారంగపాణి, బొల్లం విజయ్, జన్ను కుమార్, కంది యాదగిరి, ఇట్యాల చిన్న సతీశ్, మంతుర్తి కుమార్, శ్రీపతి మోహన్, చెక్కర స్వామి, రేణుకారావు, వీర రవి, విజయ్, రంజిత్, జన్ను సారంగపాణి పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చెన్నారావుపేటలోని పోలీస్‌స్టేషన్‌లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వన ప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య, ఎస్సై తోట మహేందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌లో పోలీసు అమరులకు సిబ్బంది నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ఓపెన్‌హౌస్‌లో కేజీబీవీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయుధాల వినియోగంపై ఎస్సై రాజారాం వివరించారు. రాయపర్తి పోలీస్‌స్టేషన్‌లో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ఓపెన్‌హౌస్ నిర్వహించారు. ముందుగా పోలీస్ అమరవీరులకు సిబ్బంది నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు, రిజిస్టర్లు, ఆయుధాల గది, ఆయుధాల పనితీరు, నేరాల నమోదు, లాకప్‌లు, సన్నిహిత కౌంటర్, ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన కల్పించారు. అనంతరం కొండూరు జడ్పీహెచ్ఎస్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి పోలీసులు కొవ్వొత్తులతో పోలీస్‌స్టేషన్ నుంచి వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి మీదుగా రాజీవ్ చౌరస్తా వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. పర్వతగిరిలో పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై దేవేందర్, ఎంపీటీసీ మాడ్గుల రాజు, సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు, ఉపసర్పంచ్ రంగు జనార్దన్, సిబ్బంది పాల్గొన్నారు.