కరీమబాద్, జూన్ 10: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనే సామెత నిజమవుతుందనుకున్నాడే ఏమో.. జల్సాలకు అలవాటు పడి.. బిజినెస్‌కు దోస్తుల దగ్గర చేసిన అప్పులు తీర్చడం కోసం తన ఇంటిలోనే దొంగతనం చేశాడో యువకుడు.. ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. కన్న కొడుకే చోరీ చేశాడనే విషయం తెలియడంతో ఆ తండ్రి ఆవేదన చెందాడు. ఈ మేరకు ఖిలావరంగల్ పడమర కోటలో రెండు రోజుల క్రితం జరిగిన దొంగతనం వివరాలను మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో వరంగల్ ఏసీపీ నందిరాం వెల్లడించారు.
పడమరకోటకు చెందిన గుర్రపు రామకృష్ణ కొడుకు జయంత్ హైదరాబాద్‌లో బీబీసీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ నెల 8న రామకృష్ణ భార్య, కూతురుతో కలిసి హైదరాబాద్‌లోని బంధువుల ఫంక్షన్‌కు వెళ్లారు. అదే రోజు రాత్రి రాగా ఇంట్లోని సామాన్లు చిందరవందరగా పడి ఉన్నట్లు గమనించి, లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని బంగారు నగలు అపహరణకు గురైనట్లు గుర్తించి మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 10న ఫోర్టు రోడ్డు జంక్షన్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా గుర్రపు జయంత్ పారిపోయే ప్రయత్నం చేశాడు.
దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. జయంత్ గర్ల్ ఫ్రెండ్‌తో జల్సాలు చేసేందుకు డబ్బుల అవసరం పడ్డాయి. దీంతో పాటు హైదరాబాద్‌లో ఫుడ్ కోర్టు పెట్టి వ్యాపారంలో నష్టపోవడంతో మిత్రుల దగ్గర అప్పులు చేశాడు. జల్సాలు, అప్పులు తీర్చడం కోసం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు బంగారం దొంగతనం చేశాడు. దాన్ని అమ్మి అప్పులు తీర్చుదామని అనుకున్నాడు. బంగారం కరిగించి అమ్మేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ బొల్లం రమేశ్, ఎస్సైలు శ్రీకాంత్, సురేశ్, సిబ్బంది ప్రవీణ్‌రెడ్డి, వాజిద్, నరేందర్, రఫీలను ఏసీపీ అభినందించారు. నిందితుడి నుంచి 11.16 గ్రాముల బంగారం, ఒక ద్విచక్ర వాహనం, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.