మహబూబాబాద్, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే కవులు, కళాకారులకు గుర్తింపు లభించిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం మహబూబాబాద్‌లోని కలెక్టర్ కార్యాలయంలో కాళోజీ సాహిత్య పురసార గ్రహీత గొడిశాల జయరాజుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేయగా ముఖ్య అతిథులుగా మంత్రి సత్యవతి, కవి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్ హాజరై ఆయన్ను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కవులు, కళాకారులు, రచయితలకు సముచిత గౌరవం దకుతున్నదని పేర్కొన్నారు. కాళోజీ సాహిత్య పురసారం అందుకున్న జయరాజుని సన్మానించుకోవడం జిల్లాను సన్మానించుకున్నంత గొప్పగా ఉందన్నారు. పల్లె ప్రకృతిని, మట్టి వాసనను తెలిపేలా అతడి కవితలు, పాటలు ఉంటాయన్నారు. సమైక్యపాలనలో తెలంగాణ భాష, యాస, సంసృతి అంటే చిన్నచూపు ఉండేదని స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తెలంగాణ భాషకు, యాసకు, సంసృతికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. సాహిత్యానికి పూర్వవైభవం వచ్చిందన్నారు.
కళాకారులకు పింఛన్లు సైతం అందజేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కవుల పాత్ర చాలా గొప్పదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నాటి నుంచే సాహిత్యం పాత్ర గొప్పదని, కాలాన్ని ముందే పసిగట్టి హెచ్చరిక చేసే వారు కవులు, ఒక పుస్తకాన్ని ఒక వాక్యంలో చెప్పే ఘనత ఒక కవికి మాత్రమే సాధ్యమవుతుందన్నారు. కవిత్వానికి ఉండే పదును, శక్తి మరి దేనికీ ఉండదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలోని కవులకు అంతే ప్రాధాన్యం ఇవ్వడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, కలెక్టర్ శశాంక, ఎస్పీ చంద్రమోహన్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, బానోత్ రవికుమార్ పాల్గొన్నారు.
మానుకోట బిడ్డ ప్రజాకవి జయరాజుకు అవార్డు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మానుకోట మనవరాలిగా ఎంతో గర్విస్తున్నా. సీఎం కేసీఆర్ నన్ను అకాడమీ చైర్మన్‌గా నియమించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇందుకోసం నా శాయశక్తులా కృషిచేస్తా. తెలంగాణ వచ్చిన తర్వాతే కవులు, కళాకారులకు గుర్తింపు వచ్చింది. మారుమూల ప్రాంతాల నుంచి కళాకారులను గుర్తించి వారికి అవార్డులు అందిస్తూ ప్రోత్సహిస్తున్నది ప్రభుత్వం. జయరాజు పాటలు ఎంతో సందేశాత్మకంగా ఉంటాయి. త్వరలోనే జిల్లాకేంద్రంలో అకాడమీ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాట్యం నేర్పించేలా నా వంతు కృషిచేస్తా.
– దీపికారెడ్డి, తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్మన్
దాశరథిలా జీవిస్తున్నా..
తెలంగాణ ఉద్యమ సమయంలో దాశరథిలా జీవిస్తూ కాళోజీలాగా ప్రశ్నిస్తూ ముందుకు సాగాను. పేద కుటుంబంలో పుట్టిన నన్ను కవిగా, గాయకునిగా మార్చింది పేదరికమే. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక ఎన్నో పాటలు రాశాను. నీళ్లు లేక ఇకడినుంచి మా నాన్నతో కలిసి నాగార్జునసాగర్‌కు వలస వెళ్లాను. అవార్డు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నా అది చూసేందుకు మా నాన్న లేకపోవడం బాధగా ఉంది. వేదికపై మాట్లాడుతూనే ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.
తెలంగాణ రాక ముందుకు ఎలా ఉంది? వచ్చిన తర్వాత ఎలా ఉందనే విషయాన్ని ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. సమైక్య పాలనలో గ్రామాల్లో యువకులు గడ్డం పెంచితేనే నక్సలైట్ అని ముద్ర వేసి ఎన్కౌంటర్లు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నాకు అవార్డు రావడానికి సహకరించిన దేశపతి శ్రీనివాస్‌తో పాటు అవార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ఎంతో రుణపడి ఉంటా.
– జయరాజ్, కాళోజీ అవార్డు గ్రహీత
మానుకోటకు ప్రత్యేక స్థానం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మానుకోటకు ప్రత్యేక స్థానం ఉంది. వెనుకబడ్డ తెలంగాణలో వివక్షకు గురైన మానుకోట ప్రాంతం ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ రావడమే. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఉద్యమ సమయంలో మానుకోట ప్రాంతంలోని ప్రతి గ్రామాన్ని తిరిగి అందరినీ ఉత్తేజపరిచిన విషయాన్ని గుర్తుచేశారు. మట్టి పాటల ఊట మానుకోట అంటూ అభివర్ణించారు. ఇకడ జన్మించిన జయరాజు పాట రాష్ట్రవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. మట్టి కణాలను అగ్ని కణాలుగా మార్చిన వ్యక్తి దాశరథి, ఆయన వెంట మిలిటరీ పడి జైలుకు పంపినా కూడా కవితలు రాయడం ఆపలేదు.
ఆయన కవితలే అగ్నిధారగా మారి ఉద్యమంగా మారింది. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన గొప్ప వ్యక్తి దాశరథి. తెలంగాణ ఎవరో ఇస్తే రాలేదని ప్రజల పోరాటం వల్లనే వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాతే కాళోజీ నారాయణరావు పేరిట అవార్డులు ఇస్తున్నారు. మానుకోట మట్టిలో పుట్టిన జయరాజు చిన్నప్పటి నుంచి ఎంతో పేదరికం అనుభవించాడు. ఆయన ఎన్నో రచనలు చేసి తన పాటలతో తెలంగాణకు అందించారు. అలాంటి గొప్ప వ్యక్తికి కాళోజీ అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది.
– కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
విద్యార్థి దశ నుంచి చురుకుగా ఉండేవాడు
జయరాజు, నేను ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నం. జయరాజుకు విద్యార్థి దశ నుంచి పోరాట స్ఫూర్తి ఉండేది. స్వయంగా రచించి పాటలు పాడేవాడు. చదువు కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లాడు. సాహిత్యాన్ని నమ్ముకొని జాతిని మేలొలిపాడు. మానుకోట గడ్డ పౌరుషం జయరాజులో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తన పాటల ద్వారా ఎన్నో అస్త్రాలు ఉద్యమ సమయంలో విసిరారు. దేశపతి శ్రీనివాస్, జయరాజు , నేను గ్రామాల్లో యువతను జాగృతం చేశాం.
– తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ