నల్లబెల్లి, అక్టోబర్ 14: నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో పోడు భూముల సర్వే శుక్రవారం ప్రారంభమైంది. పోడు భూములకు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు సర్వే పనులు చేపట్టారు. ఈ మేరకు నల్లబెల్లి మండలంలోని మూడుచెక్కలపల్లెలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సతీశ్ ఆధ్వర్యంలో పోడు భూములను జీపీఎస్ ద్వారా సర్వే చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ పూల్‌సింగ్ మాట్లాడుతూ 2005కు ముందు పోడు చేసుకుని పంటలు సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు అందిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. మూడుచెక్కలపల్లె, ఎర్రచెరువుతండా, లైన్‌తండా, గోవిందాపూర్, మేడెపల్లి, రాంపూర్, గొల్లపల్లె, ఆసరవెల్లి, కొండాపూర్, రామారావుతండా, గణేశ్‌నగర్‌లో పోడు భూములను జీపీఎస్ ద్వారా అధికారులు సర్వే చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. సర్వేకు వచ్చే అధికారులకు పోడు రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి యాదగిరి, ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ బానోత్ శ్రీను, కార్యదర్శి ధరావత్ భోజ్యానాయక్, మూడు మంగీలాల్, రైతులు పాల్గొన్నారు.
ఏనుగల్తండాలో సర్వే
నర్సంపేట రూరల్: పోడు రైతులకు హక్కుపత్రాలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భూముల సర్వే కార్యక్రమాన్ని చేపట్టింది. నిజమైన పోడు రైతులకు న్యాయం జరిగేలా ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు గ్రామాల్లో పోడు భూముల సమగ్ర సర్వే చేపట్టారు. అధికారులకు రైతులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. నాన్ట్రైబల్స్, ట్రైబల్స్ హక్కు పత్రాల కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, సాగుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం వాటిని పరిశీలించిన అధికారులు సర్వే చేస్తున్నారు. అటవీ హక్కుచట్టం ప్రకారం 2005 కంటే ముందు నుంచే పోడు భూములను సాగు చేస్తున్న వారికే హక్కుపత్రాలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు శుక్రవారం నర్సంపేట మండలంలోని ఏనుగల్తండాలో ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు పోడు భూముల సమగ్ర సర్వే చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌బీవో చంద్రమౌళి, కార్యదర్శులు శ్రీధర్, రవిచంద్ర, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బొడియతండాలో దరఖాస్తులు..
ఖానాపురం: ఎఫ్ఆర్సీ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బొడియతండాలో పోడు భూములపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా తండా నుంచి 17 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వాటి పరిశీలనకు ఆర్ఐ సత్యనారాయణ, సర్పంచ్ కాస ప్రవీణ్‌కుమార్, బీట్ అధికారి ధర్మతోపాటు ఇతర ఆధికారులు రైతుల వద్దకు వెళ్లి ప్రత్యేక యాప్‌లో పొందుపర్చారు. రైతుల ఫొటోలు తీసుకొని హద్దుల వివరాలతో కూడిన సమాచారాన్ని యాప్‌లో నమోదు చేసుకున్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.