‘ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరుగలేదు. దర్వాజలు బంద్ చేసి, ఎలాంటి చర్చలు లేకుండానే నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రాంత నాయకులు మాట్లాడకుండా మైకులు బంద్ చేశారు. పెప్పర్ స్ప్రే దాడులు చేయించి వారి అభిప్రాయాలు తెలుపకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనతో సమస్యలు వచ్చాయి’
– తెలంగాణ ఏర్పాటు విషయంపై రాజ్యసభలో ప్రధాని మోదీ అక్కసు వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను, వేలాది మంది అమరుల బలిదానాలను, ప్రపంచాన్నే తనవైపు తిప్పిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని హేళన చేస్తూ ప్రధాని మోదీ రాజ్యసభ వేదికగా మాట్లాడిన మాటలపై ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరకరమని, ఆక్షేపణీయమని, తెలంగాణ సమాజాన్నే కించపరిచేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యల్పకాలంలోనే తెలంగాణ అనేక అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలువడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నదని, మొదటి నుంచీ తెలంగాణపై విషం చిమ్ముతున్న మోదీ స్వార్థరాజకీయాలకు ఈ వ్యాఖ్యలు సాక్ష్యంగా నిలిచాయనే వాదనలు వినిపిస్తున్నాయి. విభజన హామీలను ఒక్కటైనా నెరవేర్చకపోగా ఇలా అక్కసు వెల్లగక్కడం ప్రధాని స్థానంలో ఉన్న మోదీకి తగదని, ఇకనైనా బీజేపీ తీరు మారకుంటే ప్రజలే కర్రుకాల్చి వాతపెడుతారని ప్రజాప్రతినిధులు, రాజకీయ మేధావులు, ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు.
– వరంగల్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఆరు దశాబ్దాల ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి తన వ్యతిరేకతను చాటుకున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన తెలంగాణపై ఆక్రోశం వెళ్లగక్కారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సరిగా జరుగలేదని, చర్చలే లేవని, దర్వాజలు మూసి తెలంగాణను ఏర్పాటు చేశారని చట్టసభలనే విమర్శించేలా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే సమస్యలు వచ్చాయని చెప్పారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడడం సరికాదనే అర్థం వచ్చేలా రాజ్యసభలో ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. వేలాది మంది అమరుల త్యాగాలు, లక్షలాదిమంది ఉద్యమ ఫలితంగా వచ్చిన తెలంగాణపై మోదీకి ఉన్న వ్యతిరేకత మరోసారి స్పష్టమైందని అంటున్నారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడిన మోదీ తీరు సరిగా లేదని చెబుతున్నారు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని వ్యక్తి ప్రధానమంత్రి హోదాకు తగిన వ్యక్తి కాదని మండిపడుతున్నారు. తెలంగాణపై బీజేపీకి ఉండే వ్యతిరేక ధోరణి మరోసారి స్పష్టమైందని ఉద్యమకారులు, విద్యార్థులు గుర్తు చేస్తున్నారు. ప్రధాని వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, మేధావులు, ఉద్యమకారులు ముక్తకంఠంతో మోదీ మాటలను ఖండిస్తున్నారు. అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్న తెలంగాణ పురోగతిని ఓర్వలేకనే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నేడు నిరసన కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు.
హనుమకొండ, ఫిబ్రవరి 8: సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో మంగళవారం చేసిన వ్యాఖ్య లు పూర్తిగా అభ్యంతరకరం.. ఆక్షేపణీయం.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా.. దేశ సమా ఖ్య స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలున్నాయి. ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఏమాత్రం నమ్మకం లేదని తేలిపోయింది. తెలంగాణపై మోదీకి, బీజేపీకి ఎందుకంత అకసు?. అభివృద్ధిని చూసి ఓర్వలేకే, అవమానకర వ్యా ఖ్యలు చేస్తున్నారు. తెలంగాణకు బీజేపీ వ్యతిరేకం కాబట్టే విభజన హామీలను అమలు చేయడం లేదు. ఏ విభజన స్ఫూర్తితో లోయర్ సీలేరు ప్రాజెక్టు సహా, ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారు? ప్రధానమంత్రిగా ఉండి మోదీ అలా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇప్పుడు బీజేపీ తెలంగాణ నేతలు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతారు? ప్రధాని మోదీ మాటలతో బీజేపీ బండారం మరోసారి బయటపడ్డది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.
– ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
వర్ధన్నపేట, ఫిబ్రవరి 8 : దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ విషం కక్కుతున్నది. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఏర్పాటు విషయంలో మాట్లాడిన తీరు తెలంగాణ ప్రజలను కలవరానికి గురిచేసేలా ఉంది. రానున్న రోజుల్లోనూ తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం చేసే ప్రమాదముంది. అందుక ని తెలంగాణ ప్రజలు బీజేపీపై అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ ఏర్పాటుతో ఇక్కడి రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఎంతో పురోగతి సాధిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేకనే ప్రధాని సహా బీజేపీ నేతలు తెలంగాణపై అక్కసు వెల్లగక్కుతున్నారు. అంతేగాక ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తమకు ముప్పు వస్తుందేమోననే భయంతోనే తెలంగాణపై బీజేపీ నేతలు తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారు. బీజేపీపై తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రానున్న రోజుల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారు.
– గుజ్జ సంపత్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు, ఏఎంసీ మాజీ చైర్మన్, వర్ధన్నపేట
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 8: తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను, అమరుల బలిదానాలను అవహేళన చేసినట్లుగా ఉన్నాయి. గతంలోనూ పలుమార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మోదీ పదేపదే తెలంగాణపై వ్యతిరేకతను చాటుకుంటున్నారు. పోలవరం ముంపు మండలాలను ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్‌లో కలుపడం, అధికారంలోకి వచ్చి ఏడేళ్లయినా కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, తెలంగాణలో ఒక ప్రాజెక్టుకైనా జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీ ఇవ్వకుండా, ఏపీ విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా మోదీ ప్రభుత్వం తెలంగాణతో ఆటలాడుకుంటున్నది. తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణిలో కొత్త బొగ్గుగనులను ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తున్నది. ఈ చర్యలతో ప్రధాని, కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ ప్రజలపై చూపుతున్న వివక్ష సుస్పష్టమవుతున్నది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మత రాజకీయాలతో విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకొంటున్న బీజేపీ కుయుక్తులను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలి. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ తెలంగాణ ఎంపీలు సింగరేణి గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన గళాన్ని వినిపించాలి.
– తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
దేవరుప్పుల, ఫిబ్రవరి 8 : ప్రధాని మోదీ మొదటి నుంచీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. తెలంగాణ ప్రజలపై ఆయనకు ఎందుకింత వివక్ష? ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టిన తీరును రాజ్యసభలో తప్పుపట్టడం ఆక్షేపణీయం. ఓవైపు విభజనకు అనుకూలం అంటూనే మరోవైపు విషం కక్కడం తెలంగాణ ఏర్పాటుపై ఆ పార్టీ వైఖరిని బయటపెడుతున్నది. అత్యల్ప కాలంలోనే తెలంగాణ అనేక అంశాల్లో దేశానికి ఆదర్శం కావడం బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నది. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు చూస్తుంటే బీజేపీకి మింగుడుపడడం లేదు. కావాలనే కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకు కేటాయింపులు చేయడం లేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడడాన్ని అందరూ గమనిస్తున్నారు. వాపును చూసి బలుపనుకునే బీజేపీ నేతలకు ప్రజలు కర్రుకాల్చి వాతపెడుతరు.
– కుతాటి నర్సింహులు, తెలంగాణ ఉద్యమకారుడు, నీర్మాల
నర్సింహులపేట, ఫిబ్రవరి 8 : దశాబ్దాల పోరాటాన్ని, ప్రాణ త్యాగాలను ప్రధాని మోదీ కించపర్చడంతో పాటు తెలంగాణపై విషం కక్కుతున్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో సుష్మాస్వరాజ్, ఎల్కే అద్వానీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయకుడు పార్లమెంట్లో ఉన్నారు. మోదీ ప్రధాని కాగానే తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపుతున్నారు. కొత్త జిల్లాలకు నవోదయ స్కూళ్లు ఇవ్వడం లేదు. విభజన చట్టంలో ఉన్నవాటిని ఇప్పటికీ అమలు చేయకపోవడం దురదృష్టకరం. కేంద్రంలోని బీజేపీ నాయకులు సహాయం చేయకపోగా తెలంగాణపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలి.
– ధరంసోత్ రెడ్యానాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే
హనుమకొండ సబర్బన్, ఫిబ్రవరి 8: ప్రజా ఉద్యమాలపై అవగాహన లేని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంపై మొదటి నుంచీ అక్కసు వెల్లగక్కుతూనేఉన్నాడు. మతం పేరిట ప్రధాన మంత్రి పీఠం ఎక్కిన ఆయన తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో ప్రాణ త్యాగాలు చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఆయన ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోకుంటే ప్రజల తిరస్కారానికి గురికాక తప్పదు. తాను దేశం మొత్తానికి ప్రధానిని అనే స్పృహను తెచ్చుకొని విభజన హామీలను అమలు చేసి తన హోదాను ప్రదర్శించాలి.. అంతేగానీ చవకబారు మాటలతో అభాసుపాలు కావద్దు.
– ముద్రబోయిన వెంకటేశ్ యాదవ్, తెలంగాణ ఉద్యమకారుడు
నర్సింహులపేట : విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రధాన మంత్రి మోదీ తెలంగాణపై వివక్ష చూపుతున్నారు. తెలంగాణ విషయంలో ఆయన అసమర్థ వ్యాఖ్యలు చేస్తున్నారు. అభివృద్ధి కోసం నిధులు ఇవ్వకపోగా తెలంగాణ ఉద్యమకారులను అవమానించేలా మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
-ఎండీ ఖాజామియా, ఉద్యమకారుడు, నర్సింహులపేట
జనగామ చౌరస్తా, ఫిబ్రవరి 8 : మైకులు ఆపి, చర్చలు లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేశారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ఏర్పాటుపై నరేంద్ర మోదీ తొలినుంచీ అక్కసు వెళ్లగక్కుతున్నారు. గతంలో తల్లిని చంపి బిడ్డను బతికించారని ఎద్దేవా చేశారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మళ్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది. భారతదేశ చరిత్రలో తెలంగాణ ఏర్పాటుపై జరిగినన్ని చర్చలు, సంప్రదింపులు ఏ రాష్ట్ర ఏర్పాటు విషయంలోనూ జరుగలేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో, శాంతియుత పోరాట పంథాలో భారత పార్లమెంట్‌ను ఒప్పించి, మెప్పించి రాష్ర్టాన్ని సాధించుకున్నాం. కానీ మోదీ ప్రభుత్వం రాగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాత్రికి రాత్రే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో అప్రజాస్వామికంగా కలిపింది. ఎనిమిదేండ్ల కాలంలో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాల హక్కులను హరించేలా అనేక చట్టాలు తీసుకొచ్చింది. కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో, నదుల అనుసంధానంలో గోదావరి, కృష్ణా నదులపై బోర్డులు ఏర్పాటు చేయడంలో మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించింది. ప్రజలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలన్నది బీజేపీ విధానం. అందుకే మోదీ మొదటి నుంచీ తెలంగాణపై తన అజీర్తిని వెళ్లగక్కుతున్నారు.
– ఎర్రోజు శ్రీనివాస్, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనగామ
కేసముద్రం, ఫిబ్రవరి 8 : ప్రధానమంత్రి మోదీ ఎన్నో ఏం డ్లుగా తెలంగాణపై ఉన్న అక్కసును వెల్లగక్కుతున్నుడు. రాజ్యసభలో ఆయన చేసిన వ్యాఖ్యల తో మరోసారి ఆయన నిజ స్వరూ పం బయటపడింది. సీఎం కేసీఆర్ ఆమరణ దీక్ష , తెలంగాణ ప్ర జల పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణపై హేళన చేస్తూ మాట్లాడడం సరికాదు. పార్లమెంట్, రాజ్యసభలో చర్చించి బిల్లు అమోదించిన విషయాన్ని మోదీ గుర్తు చేసుకోవాలి. కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి నిధులిచ్చి అభివృద్ధి చేయాల్సిన ప్రధాని, ఇలా చులకనగా మాట్లాడడం మంచిదికాదు. – గందసిరి సోమన్న, ఉద్యకారుడు
నర్సంపేట, ఫిబ్రవరి 8: ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఎందరో అమరుల త్యాగాల పునాదుల మీ ద రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను గౌరవించాలి. ప్రజలు ప్రత్యేకరాష్ట్రం కోసం ఉద్యమించారు. ప్రపంచంలోనే తెలంగాణ ఉద్యమం గొప్ప ది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమం కొనసాగింది. ప్రజల ఆకాంక్షకు తలొగ్గి ఎట్టకేలకు రాష్ర్టాన్నిచ్చారు. అలాంటి రాష్ర్టానికి నిధులు కేటాయించడంలో ఇ ప్పుడు కేంద్ర బీజేపీ పాలకులు వివక్ష చూపుతున్నారు. తెలంగాణపై ప్రధాని మోదీ ఎప్పుడూ విషం కక్కుతునే ఉన్నారు. రాజ్యసభ వేదికగా తెలంగాణ ఏర్పాటుపై మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి.
– దార్ల రమాదేవి, కౌన్సిలర్, ఉద్యమకారులు, నర్సంపేట
ములుగు, ఫిబ్రవరి 8 (నమస్తేతెలంగాణ) : ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తొలినుంచీ తెలంగాణ వ్యతిరేకే. తెలంగాణ ఏర్పాటయ్యే క్రమం లో ఆ పార్టీ వ్యతిరేకంగా పనిచేసింది. రాజ్యసభలో మరోసారి తెలంగాణ ఏర్పాటుపై మోదీ విషం చిమ్మినట్లు మాట్లాడడం వారి స్వార్థరాజకీయాలకు సాక్ష్యంగా నిలిచింది. ఇక నుంచి బీజేపీ నాయకులను తెలంగాణలో తిరుగనివ్వకుండా చేయాలి. బండి సంజయ్, అరవింద్ కూడా తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలో ఉన్నారు. 60ఏళ్ల ఆకాంక్ష నెరవేరిన తర్వాత ఇప్పుడు బీజేపీ నాయకులు తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా మాట్లాడుతున్నారు. ఇలాంటి నాయకులున్న పార్టీని అధికారంలోకి రాకుండా చేయాలి. తెలంగాణలో బీజేపీ అవసరమా? అన్నది ప్రజలు ఆలోచించాలె.
– భూక్యా శ్రవణ్‌నాయక్, తెలంగాణ లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ (ములుగు జిల్లా)