ఏటూరునాగారం : ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలోని మేడారం తదితర ప్రాంతాల్లోనే అటవీశాఖ అధికారులు ఉద్యోగులు ప్లాస్టిక్ సేకరణ చేపట్టారు. పర్యాటకులు అడవిలో వదిలివేసిన ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లు వాటర్ బాటిల్స్ తదితర వాటిని అటవీశాఖ అధికారులు భారీగా సేకరించారు. అడవిలోని వన్యప్రాణులకు ప్లాస్టిక్ తో ప్రమాదం వాటిల్లకుండా ఉండేందుకు అటవీ శాఖ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సేకరించిన ప్లాస్టిక్ ను బస్తాల్లో నింపి ట్రాక్టర్ ద్వారా బయటకు పంపించారు. పచ్చని అడవి పర్యాటకు అందంగా కనిపించి కనువిందు చేసేలా ఉండాలని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
పలు ప్రాంతాల్లో పర్యాటకులు బస చేసి ప్లాస్టిక్ ను వదిలేస్తున్న విషయాన్ని గుర్తించి వారికి అభయారణ్యం ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు. అడవిలో ఎలాంటి వ్యర్థ పదార్థాలు వదిలేయరాదని సూచించారు.అడవిని కాపాడాలని సిగరెట్ పీడీ తాగడం మానుకోవాలని అగ్నితో అడవికి వేసవిలో ప్రమాదాలు పొంచి ఉంటాయని సూచించారు. పర్యావరణ దినోత్సవం పై అవగాహన కార్యక్రమాలను చేపట్టారు.ఈ కార్యక్రమంలో అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు పాల్గొన్నారు.