నల్లబెల్లి, మార్చి 07: రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నచందంగా నల్లబెల్లి(Nallabelli) మండలంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని లెంకాలపల్లి నుంచి నందిగామ కు వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డుపైనే ఇరుపక్కల హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చెట్లు నాటుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఈ రోడ్డు 40 ఫీట్ల వెడల్పుతో ఉండగా ఇరుపక్కల రైతులు ఆక్రమించుకోగా కేవలం 13 ఫీట్ల వెడల్పు ఉంది. కానీ 40 ఫీట్లు వదిలిపెట్టి ఇరుపక్కల చెట్లు నాటాల్సి పోయి కేవలం 13 ఫీట్ల రోడ్డుపైనే ఇరుపక్కల చెట్లు నాటుతున్నారు. మధ్యలో 10 ఫీట్ల బీటీ రోడ్డు మాత్రమే ఉంటుంది.
లక్షల రూపాయల వృథా అవుతున్న ఆర్ అండ్ బీ అధికారులు నిద్రమత్తులో మూలుగుతున్నారు. ఇలా 13 ఫీట్ల వెడల్పులో చెట్లు నాటడం వలన వచ్చిపోయే వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పటికైనా ఆర్ అండ్ బీ అధికారులు చేరుకొని రోడ్డు వెడల్పు 40 ఫీట్లు తీసి ఇరుపక్కల చెట్లను నాటే విధంగా పూనుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి నిబంధనలను కాలరాస్తున్న హెచ్ఎండీఏ అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.