మహబూబాబాద్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ) : రైళ్ల నిర్వహణలో అత్యంత కీలకమైన వాటిలో పీరియాడికల్ ఓవర్ హాలింగ్ ఒకటి. రైళ్లలో ఏర్పడే సమస్యలను పరిషరించేందుకు దెబ్బతిన్న పరికరాలను మార్చేందుకు ఈ షెడ్లు ఉపయోగపడతాయి. దక్షిణ మధ్య రైల్వేలో లోకోమోటివ్(రైలు ఇంజిన్) ఓవర్ హాలింగ్ షెడ్లు ఇప్పటివరకు లేవు. లోకోమోటివ్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్(పీఓహెచ్) ఏర్పాటు చేయాలంటే కనీసం జోన్ పరిధిలో 800 లోకోలు ఉంటే వాటి నిర్వహణ కోసం పీఓహెచ్ ఏర్పాటుచేస్తారు. సికింద్రాబాద్‌లో 1100కి పైగా లోకోలు ఉన్నప్పటికీ లోకోమోటివ్(పీఓహెచ్) లేదు.
ఈ క్రమంలో గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో లోకోమోటివ్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ షెడ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో పీవోహెచ్ వర్షాపు అందుబాటులో లేకపోవడంతో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. కొత్తగా లోకో మోటివ్ షెడ్డు ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. దక్షిణ మధ్య రైల్వేలో అటు ఆంధ్రప్రదేశ్‌కు, ఇది తెలంగాణకు మధ్యలో ఉన్న మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేస్తే అన్నింటికీ అనుకూలంగా ఉంటుంది. చెన్నయ్ నుంచి న్యూఢిల్లీ, భువనేశ్వర్ నుంచి ముంబై నగరాలను కలిపే ప్రధాన రైలు మార్గం ఈ ప్రాంతంలో ఉండడం కలిసొచ్చే అంశం. స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటే మార్గం సుగమం అవుతుంది. మహబూబాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డు సమీపంలో సుమారు 865 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో వర్షాపు నిర్మిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
లోకో మోటివ్ ఓవర్ హాలింగ్‌కు అవకాశం
పీవోహెచ్ అంటే పీరియాడిక్ ఓవర్ హాలింగ్. ఇది లోకోమోటివ్(రైలు ఇంజిన్) నిర్వహణకు ఉపయోగపడుతుంది. పీవోహెచ్ సమయం లో రైలు ఇంజిన్లకు పలు మరమ్మతులు చేస్తారు. రైలు ప్రారంభమైన తర్వాత గమ్యస్థానం చేరేలోపు తలెత్తే చిన్న చిన్న మరమ్మతులు ఆల స్యం కాకుండా పూర్తి చేసే వీలుంటుంది. లోకోమోటివ్ క్యామ్‌లా షాఫ్ట్ లు, క్రాంక్ షాఫ్ట్‌లను శుభ్రం చేస్తారు. వాటిని పరీక్షించి కాలం చెల్లిన వాటిని కొత్త వాటితో భర్తీ చేస్తారు. పిస్టన్లు, కనెక్ట్ చేసే రాడ్, సిలిండర్ హెడ్లను శుభ్రం చేస్తారు. సిలిండర్లను ఓవర్ హాలింగ్ చేయడంతో పాటు లోపభూయిష్ట భాగాలను కొత్త వాటితో భర్తీ చేస్తారు. నీరు సరఫరా అయ్యే మార్గాలను పరీక్షించి పగుళ్లను గుర్తిస్తారు. వాల్స్‌ను ఎప్పటికప్పుడు పరీక్షించి మరమ్మతు చేస్తారు. వాల్వ్, సీటుకు సంబంధించి రిపేర్లు చేస్తారు. లోకో సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారు. రోటర్ బ్యాలెన్సిం గ్, కొత్త ఆయిల్ సీల్స్, సీలెంట్ గాసెట్లు, ఫౌండేషన్ బోల్ట్‌ను అమరుస్తారు. ఎలక్ట్రికల్ లోకోమోటివ్ల కోసం పీవోహెచ్ ఆవర్తన వ్యవధి 18 ఏళ్లుగా ఉంటుంది. లోకో తిరిగిన దూరం 24లక్షల కిలోమీటర్లు రెండింటిలో ఏది ముందైతే లోకోమోటివ్ పూర్తిగా మరమ్మతు చేస్తారు.
కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
మానుకోట రైల్వే ట్రాక్ ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమి లో పీఓహెచ్ షెడ్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే రైల్వే మంత్రి కి విజ్ఞప్తులు వెళ్లాయి. దక్షిణ మధ్య రైల్వేలో ఎలక్ట్రిక్ లోకోమోటివ్ను పూర్తిస్థాయిలో ఓవర్ హాలింగ్ చేసే వ్యవస్థ సికింద్రాబాద్ జోన్లో లేదు. ప్రస్తుతం ఓవర్ హాలింగ్ కోసం కాంచీపురంలోని బుస్వాల్ షెడ్డుకు లోకోలను పంపుతున్నారు. రాష్ట్రంలో పీవోహెచ్ షెడ్ లేని కారణంగా స్థానిక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు కొంతమందిని తమిళనాడుకు పంపుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే మహబూబాబాద్ రైల్వేలో నూతన అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
10వేల మందికి ఉపాధి అవకాశాలు
మానుకోట జిల్లాకేంద్రంలో పీరియాడిక్ ఓవర్ హాలింగ్ షెడ్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ జిల్లాలో ఎకువగా గిరిజనులు ఉన్నందున ఈ షెడ్డు నిర్మాణం జరిగితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మానుకోట ఎంపీతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పీఓహెచ్ ఏర్పాటుకు కృషిచేయాలి.
– ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు
ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి
ఎలక్రిక్ లోకో మోటివ్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ షెడ్ల ఏర్పాటుకు అన్ని రకాల వనరులు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి మహబూబాబాద్‌లో వర్‌షాప్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. 5వేల మందికి ప్రత్యక్షంగా, మరో 5వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు చొరవ చూపాలి. సికింద్రాబాద్ జోన్లో పీఓహెచ్ వర్‌షాప్ లేకపోవడం వల్ల తమిళనాడు పెరంబూర్, ఒడిశాలోని బుస్వాల్కు వెళ్లడం వల్ల అధిక భారం, సమయం వృథా అవుతున్న నేపథ్యంలో మానుకోట రైల్వేస్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయాలి.
– మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ కార్యదర్శి యుగంధర్ యాదవ్