ములుగు, నవంబర్ 14 (నమస్తేతెలంగాణ) : గ్రామపంచాయతీగా కొనసాగిన ములుగు జిల్లా కేంద్రం.. మున్సిపాలిటీగా మారితే మెరుగైన సౌకర్యాలతోపాటు అభివృద్ధి జరుగుతుందని స్థానిక జనం ఆశపడ్డారు. కానీ, వారి ఆశలు అడియాసలయ్యాయి. దీనికి తోడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు ములుగు జీపీ పరిధిలో దాదాపు 9వేల గృహాలకు సంబంధించి ఇంటి నంబర్ల వివరాలు రికార్డుల్లో నమోదై ఉండగా, ప్రస్తుతం 5,700 ఇండ్లకు సంబంధించిన వివరాలు మాత్రమే ఆన్లైన్లో చూపిస్తున్నాయి.
ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్ను కట్టేందుకు వెళ్తే.. ‘సారీ.. మీ ఇంటి నంబర్ ఆన్లైన్లో చూపించడం లేద’ ని, మళ్లీ ఇంటి పూర్తి దస్తావేజులతోపాటు గతంలో జీపీకి కట్టిన పన్ను రసీదులు, ఇతర ఆధారాలతో అర్జీ పెట్టుకుంటే పరిశీలించి ఆన్లైన్లో ఇంటి నంబర్లు నమోదు చేస్తామని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలపై ఆర్థికభారం పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జీపీ పరిధిలో గతంలో ఇంటి పన్నులు కట్టి రసీదులు పొందామని, ఇప్పుడు ఎందుకు ఇంటి నంబర్లు చూపించడం లేదని అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. అయితే, గతంలో 2022లో ఇంటి నంబర్లను కొంత మేరకు మాత్రమే ఆన్లైన్ చేసి, మిగతా నంబర్లను వదిలేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు.
ఆన్లైన్లో నమోదు చేసిన వివరాల్లో కూడా ఇంటి నంబర్లతోపాటు గృహ యజమానుల పేర్లు తప్పుగా ఉన్నాయి. వీటిని సవరించేందుకు కూడా ధ్రువీకరణ పత్రాలు అవసరమని అధికారులు తేల్చి చెబుతున్నారు. గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు పనిచేసిన అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయమై మున్సిపాలిటీ కమిషనర్ సంపత్‌ను వివరణ కోరగా.. ఇంటి నంబర్లు ఆన్లైన్లో నమోదు కాలేదన్న మాట వాస్తవమేనన్నా రు. గతంలో ఇంటి నంబర్లు ఆన్లైన్లో నమోదు చేయకపోవడం వల్ల సమస్య ఏర్పడుతున్నదని, ఇంటి నంబర్ ఆన్లైన్లో చూపించని వారు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే పరిష్కరిస్తామని తెలిపారు.