వరంగల్, జనవరి 7 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన పింఛన్ల హామీ సంగతేమైందని పింఛన్‌దారులు ప్రశ్నిస్తున్నారు. సర్వే పేరిట రెండేళ్లుగా కాలయాపన చేస్తూ వస్తుండడంతో గ్రేటర్ వరంగల్‌లో ఆరు వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన ఆసరా పింఛన్లే లబ్ధిదారులకు అందుతున్నాయి. కొత్తది ఒక్కటీ ఇవ్వలేదు. పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు కార్పొరేషన్ చుట్టూ తిరుగుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్లతోనే భరోసా
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో 77,768 మందికి పింఛన్లు అందించింది. ఇందులో 32,446 మంది వితంతువులు, 25,356 మంది వృద్ధులు, 8,998 మంది దివ్యాంగులు, 6,011 మంది బీడీ కార్మికులు, 2,363 మంది ఒంట రి మహిళలు, 642 మంది గీత కార్మికులు, 1,952 మంది చేనేత కార్మికులు ఉన్నారు. ఆసరా పింఛన్‌ను రూ. రెండు వేలకు పెంచింది. అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీలో రూ.4 వేలకు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా అమలు చేయకుండా తమను మోసం చేసిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల పెంపు దేవుడెరుగు.. కొత్తవి మంజూరు చేయాలంటున్నారు.
ప్రభుత్వ మెలికతో మరింత జాప్యం
కాంగ్రెస్ ప్రభుత్వం మెలిక పెట్టి కొత్త పింఛన్ల మంజూరుకు మరింత జాప్యం చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పొందుతున్న పింఛన్లపై క్షేత్రస్థాయిలో సర్వే చేసి లెక్కలు తేల్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో మరణించిన వారిని తొలగించిన తర్వాతనే కొత్తవి మంజూరు చేయాలన్న సర్కారు నిర్ణయంతో నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారు నిరాశలో మునిగిపోయారు. సర్వే పేరిట కొత్త పింఛన్ల మంజూరు నిలిపివేయడంపై సరికాదని, ప్రక్రియ నిరంతరంగా జరపాలని పేర్కొంటున్నారు.