హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 16 : తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానలు పటిష్టమై పేదల పెన్నిధిగా మారాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆర్మూరు జిల్లా కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న రాచర్ల షాలిని హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన(జీఎంహెచ్)లో ప్రసవించింది. పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా, శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చీఫ్‌విప్ దాస్యం వినయ్భాసర్తో కలిసి ఆమెను, కుటుంబ సభ్యులను అభినందించారు. కేసీఆర్ కిట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దవాఖానలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సర్కారు దవాఖానల్లో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం కార్పొరేట్ తరహాలో మెరుగైన వైద్యం అందిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ వైద్యశాలలు పటిష్టమై పేదలకు వరంగా మారాయని తెలిపారు.
వరంగల్ జిల్లాలో ప్రైవేట్, ప్రభుత్వ దవాఖానలకు సంబంధించి రివ్యూ చేసినప్పుడు ప్రభుత్వ దవాఖానల్లోనే నార్మల్ డెలివరీలు ఎకువగా జరుగుతున్నట్లు తేలిందన్నారు. 80 నుంచి 90 శాతం వరకు నార్మల్ డెలివరీలు సర్కారు దవాఖానల్లో జరుగుతుండగా, 60 నుంచి 70 శాతం వరకు ఆపరేషన్లు ప్రైవేటు హాస్పిటళ్లలో జరుగుతున్నట్లు నివేదికలో వెల్లడైందని తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతున్నారని అన్నారు. కేసీఆర్ కిట్‌తోపాటు అమ్మాయి పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12వేలు అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుపేదల అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.
దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందుతున్నదన్నారు. రాచర్ల షాలిని హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో ప్రసూతి చేయించుకుని ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. ఇలాంటి ప్రభుత్వ దవాఖానలో పేద ప్రజలే కాకుండా ఉన్నతాధికారులు కూడా డెలివరీ కావడం నిజంగా శుభసూచికమని, మెరుగైన వైద్యసేవలందిస్తున్న వైద్యులను, సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మంత్రి ఎర్రబెల్లి సతీమణి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదయాకర్ రావు, డీఎంహెచ్‌వో డాక్టర్ సాంబశివరావు, హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఆర్ఎంవో సారంగం, వైద్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.