చెన్నారావుపేట, జూన్ 22 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను ఎన్నికల భరోసాగా మార్చిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయిన్పహాడ్ గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ మండలంలో అభివృద్ధి పనులు చేసింది బీఆర్ఎస్సే అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే తన సొంత మండలానికి 18 నెలల్లో ఎన్ని నిధులు తీసుకువచ్చాడో, ఏం చేశాడో చెప్పాలన్నారు. మండలంలోని తండాలకు రూ. 9 కోట్లతో ప్రత్యేక బీటీ రోడ్లు మంజూరు చేస్తే ఎమ్మెల్యే వాటిని రద్దు చేశారన్నారు.
తాను తెచ్చిన నిధులతోనే ప్రస్తుతం రెండు బీటీ రోడ్ల పనులు చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో తాను మంజూరు చేసిన బ్రిడ్జి కమ్ చెక్‌డ్యాం పనులను కమీషన్ల కోసం అమ్ముకున్నారని విమర్శించారు. తాను చేసిన అభివృద్ధిలో ఒక్క శాతం కూడా ప్రస్తుత ఎమ్మెల్యే చేయలేడన్నారు. మండల కేంద్రంలో డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, రైతు వేదికలు, పల్లె దవాఖానలు తదితర అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాంలో గ్రామాలు, తండాల్లో జరిగిన అభివృద్ధిని శ్రేణులు ప్రజలకు వివరించాలన్నారు.
సమావేశంలో పార్టీ మండల బాధ్యుడు బాల్నె వెంకన్న, మాజీ జడ్పీటీసీ పత్తి నాయక్, మాజీ ఎంపీపీ జక్క అశోక్, నాయకులు తూటి శ్రీనివాస్, కొండవీటి ప్రదీప్, బోడ బద్దూనాయక్, సారంగం, శ్రీనివాస్, అమీనాబాద్ పీఏసీఎస్ చైర్మన్ మురహరి రవి, మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, మాజీ సర్పంచ్‌లు కుండె మల్లయ్య, అనుముల కుమారస్వామి, భిక్షపతి, విజేందర్‌రెడ్డి, హంస విజయరామరాజు, ములుక సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ఇటీవల మృతి చెందిన జంపయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.