టేకుమట్ల, జూన్ 18 : డబ్బులు ఇవ్వకుండానే భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని ఓ వృద్ధుడిపై పోలీస్ అధికారి తన జులుం చూపిస్తున్నాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో తనకున్న భూమిని అమ్మి దవాఖానలో చూపించుకుందామనుకుంటే ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. కొంత డబ్బు ఇచ్చి తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్న సదరు అధికారి మిగతావి ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నాడు. స్థానిక పోలీసులు, ఎమ్మెల్యేకు చెప్పినా న్యాయం జరగడం లేదంటూ ఆ వృద్ధుడు బంధువులతో కలిసి పురుగుల మందు డబ్బాతో ధర్నాకు దిగాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలకేంద్రంలో మంగళవారం చోటుచేసుకోగా, రైతులు, స్థానిక ప్రజలు మద్దతుగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. ఆరెపల్లి గ్రామానికి చెందిన ఇటుకాల రాయమల్లుకు సర్వే నెంబర్ 63/అ/1-62/ఇ/1లో ఉన్న 39 గుంటల భూమిని రూ.13.65 లక్షలకు పెద్దపల్లి ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న అదే గ్రామానికి చెందిన గజ్జి కృష్ణ (ప్రస్తుతం హనుమకొండలో నివాసం ఉంటున్నారు) తన భార్య రాధిక పేరుతో కొనుగోలు చేశారు. ఒప్పందం ప్రకారం మొదట రూ.7 లక్షలు చెల్లించి, రిజిస్ట్రేషన్ సమయంలో రూ. 6.65 లక్షలు ఇవ్వాల్సి ఉంది. అయితే రిజిస్ట్రేషన్ రోజు గ్రామస్తుడు కుర్రె ప్రభాకర్ డబ్బులివ్వమని అడుగగా.. ‘యూజ్లెస్ ఫెల్లో.. నీకెలా కనపడుతున్నాను’ అంటూ బూతులు తిడుతూ కారులో కూర్చున్న తన భార్య వద్ద ఉన్న డబ్బుల బ్యాగ్‌ను ఏసీపీ చూపించాడు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇస్తానని చెప్పడంతో రిజిస్ట్రేషన్ చేయించారు.
ఆ తర్వాత డబ్బులు ఇవ్వమని అడుగగా ఇక్కడ కాదు.. ఇంటి వద్ద ఇస్తానంటూ వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లి అడుగగా బోర్ రిపేర్ చేస్తేనే మిగతా డబ్బులు ఇస్తాననడంతో ఆ విషయమై కాగితం రాసుకోలేదని, తన డబ్బులు ఇవ్వాలని కోరాడు. పెద్ద మనుషులతో ఒత్తడి చేయగా, లోన్ డబ్బులు రాగానే ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో మరోసారి వెళ్లిన వారిని ‘ఎందుకు ఇంటికి వస్తున్నారు.. మా పేరు మీదకు భూమి వచ్చింది.. ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి’ అంటూ బెదిరించాడు. ఇదే విషయమై టేకుమట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి సీఐ, డీఎస్పీతో పాటు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కలిసినా న్యాయం జరగలేదు. దీంతో చావే శరణ్యమని వృద్ధుడు పురుగుల మందు డబ్బాతో మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ధర్నాకు దిగాడు. దీంతో పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు.
రిజిస్ట్రేషన్ రోజు డబ్బులు తీసుకు వచ్చారు కానీ, ముసలాయనకు ఇయ్యలేదు. సంతకం పెట్టిన తర్వాత ఇస్తామని అక్కడ ఇయ్యలేదు. ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పి బోర్ రిపేర్ చేసిన తర్వాతనే అన్ని డబ్బులు ముట్టచెప్తానని వెళ్లిపోయారు. అసలు రూ. 20 లక్షలకు పైగా పోయే భూమిని రూ. 14 లక్షలకు అమ్మిండు. అండ్ల బోరు పోయించి ఇచ్చుడని బయాన కాగితంలో లేదు. ఉన్నట్లయి తేకాగితం చూపించుమం టే చూపించలేదు. మళ్ల డబ్బులు ఇయ్యమని ఇం టికి పోతే మొదట ఇస్తా అన్నడు. తర్వాత ఇయ్య పో అన్నడు. బరాబర్ రూ.6.65లక్షలు ఇ య్యా లె. వాళ్ల తమ్ముడు ర మేశ్ కూడా ముసలాయన దగ్గర బయాన డబ్బుల నుం చి రూ. 54 వేలు తీసుకుని నీకు బాకీ ఎక్కడిదని బెదిరిస్తున్నడు. ఇయ్యమని అడిగితే నీకు ఎందుకు.. నువ్వు ముసలోనికి పుట్టినవా అని తిడుతున్నడు. ఈ విషయమై ఏసీపీ గజ్జి కృష్ణ భార్య రాధికారాణిని వివరణ కోరగా ‘మేము ప్రజలకు న్యాయం చేసేటోళ్లం.. వృద్ధుడికి అన్యాయం చేస్తమా? రూ. 6.65 లక్షలు లేకుండా ఉన్నామా? డబ్బులు కట్టకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తరు? మా ఎదుగుదలను చూసి ఓర్వలేని మా బంధువులే మమ్మల్ని బదనాం చేస్త్తున్నరు’ అని తెలిపారు.