వరంగల్ చౌరస్తా, జూన్ 25 : ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం, భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా ఆస్పత్రుల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ సర్కారు కనీసం ఓపీ చీటీలను సైతం అందించలేకపోతున్నది. పెద్దాస్పత్రిగా పేరొందిన ఎంజీఎంలో వైద్యం సంగతి దేవుడెరుగు.. ఓపీ చీటీ కోసమే రోగులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తున్నది. బుధవారం ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్లోని ప్రింటర్లు పని చేయకపోవడంతో సిబ్బంది రోగి వివరాలు, విభాగం గది నంబర్‌ను కంప్యూటర్లో నమోదు చేసిన అనంతరం తెల్ల కాగితంపై చేతితో రాసి ఇవ్వాల్సి వచ్చింది.
దీంతో ఒక్కొక్కరికి చాలా సమయం పట్టడంతో రోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కేవలం రూ. 500తో జరిగే మరమ్మత్తును కూడా అధికారులు చేపట్టలేకపోవడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ తూర్పు ప్రజాప్రతినిధిగా, రాష్ట్ర మంత్రిగా సేవలందిస్తున్న కొండా సురేఖ సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన ప్రభుత్వ ఆస్పత్రుల సంగతి ఎలా ఉంటుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇబ్బందుల్లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.