వరంగల్ చౌరస్తా, జూలై 8: ఎంజీఎం హాస్పిటల్కు ఫీవర్ ముప్పు పొంచి ఉంది. హాస్పిటల్లో జ్వరాల బారినపడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నది. సీజనల్ వ్యాధులు వస్తుండడంతో నిత్యం పదుల సంఖ్యలో బాధితులు చేరుతున్నారు. ప్రస్తుతం వంద పడకలతో ఉన్న మెడికల్ వార్డును కొనసాగిస్తూ అందులోనే ఫీవర్ బాధితులకు చికిత్స చేస్తున్నారు. ప్రత్యేకంగా ఫీవర్ వార్డును ఏర్పాటు చేయకపోవడంతో విష జ్వరాలతో వస్తున్న రోగులను మెడికల్ వార్డుల్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. గత నెల 14 మలేరియా, 15 డెంగ్యూ, 120 విష జ్వరాల కేసులు నమోదైనప్పటికీ అధికారులు కేవలం 20 పడకలతో వార్డును ఏర్పాటు చేశారు.
అవసరాన్ని బట్టి వార్డులను విస్తరిస్తూ పడకల సంఖ్యను పెంచడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారే తప్ప ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయడం లేదు. ఒక్క జూలై మొదటి వారంలోనే 52 కేసులు నమోదు కాగా, వాటిలో 47 వైరల్, 5 మలేరియా కేసులు ఉన్నాయి. ప్రత్యేక వార్డు ఏర్పాటులో జాప్యం జరగడంతో విష జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి విషజ్వరాలు విజృంభించక ముందే ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి, త్వరితగతిన వైద్యసేవలందించాలని పేషెంట్లు, అటెండెంట్లు కోరుతున్నారు.