వరంగల్ చౌరస్తా, నవంబర్ 12: వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో రోజురోజుకు ఉచిత సేవలు కనుమరుగవుతున్నాయని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రసాయనాలు అందుబాటులో లేకపోవడంతో పారా మెడికల్ సేవలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. దీంతో రోగులు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తున్నారు.
దీన్ని ప్రైవేట్ ల్యాబ్ల నిర్వాహకులు అవకాశంగా భావించి రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎంజీఎం వైద్య సిబ్బంది వారికి రెడ్ కార్పెట్ వేసి మరీ ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్లను వార్డుల్లోకి అనుమతిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే టెస్టులకు సైతం వందల రూపాయలు వసూలు చేస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. వైద్య సిబ్బంది, ల్యాబ్ల నిర్వాహకులు వాటాలు పంచుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.