హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 10 : రాఖీ పండుగకు(Rakhi) సొంత ఊళ్ల నుంచి నగరాలకు తిరుగు ప్రయాణం తిప్పలుగా మారింది. ఉమ్మడి వరంగల్ గ్రామీణ ప్రాంతాల నుంచి జనం హైదరాబాద్ వెళ్లే రూట్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. హనుమకొండ బస్ స్టేషన్లో బస్సుల్లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీకి (Rtc buses)వారం రోజుల పాటు ఇదే రూట్ల నుంచి గ్రామాలకు జనం తాకిడి ఉండటం విశేషం
వరంగల్ రీజియన్‌లోని 9 డిపోలకు చెందిన పరకాల, భూపాలపల్లి, జనగాం, మహబుబాబాద్, తొర్రూర్, నర్సంపేట బస్ స్టేషన్లు ప్రధానంగా ఉమ్మడి వరంగల్‌కు కేంద్రబిందువైన హనుమకొండ బస్ స్టేషన్ ఆదివారం ప్రయాణికులతో నిండిపోయింది. బస్సుల కోసం జనం బస్ పాయింట్ల వద్ద బారులు తీరారు. ఆయా డిపోలకు చెందిన ఆర్టీసీ అధికారులు బస్ స్టేషన్లో బస్సుల రాకపోకలను పర్యవేక్షించారు. హనుమకొండ బస్ స్టేషన్లో జనం తాకిడి ఎక్కువగా కావడంతో అధికారులు సిబ్బంది ప్రయాణికులను వెనువెంటనే బస్సులలో ఎక్కించి పంపించారు.
హైదరాబాద్ రూట్లో రద్దీ..
హైదరాబాద్ రూట్లో ఆదివారం ప్రయాణికులు పోటెత్తారు. హనుమకొండబస్ స్టేషన్‌లోని హైదరాబాద్ పాయింట్ల వద్ద బస్సులకోసం జనం క్యూ కట్టారు. ఆదివారం సెలవు దినం కావడం తెల్లవారే సోమవారం విధుల్లో చేరడానికి ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారు వేలాదిగా హైదరాబాద్‌కు వెళ్లడానికి హనుమకొండ బస్ స్టేషన్ చేరుకున్నారు. రాఖీ పండుగకు ఇంటికి వచ్చిన ప్రజలు ఒక్క ఆదివారం రోజే ఎన్నడులేని విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 500 టిప్పులు హనుమకొండ బస్ స్టేషన్ నుంచి హైదరాబాద్ రూట్లలో నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
అవస్థలుపడ్డ గ్రామీణ జనం..
వరంగల్-హైదరాబాద్ రూట్లో జనం రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికారులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు నడుస్తున్న సర్వీస్‌లను రద్దు చేసి హైదరాబాద్ రూట్లో నడపడంతో గ్రామీణ ప్రజలు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ములుగు, ఏటూర్‌నాగారం, భూపాలిపల్లి, నర్సంపేట, తొర్రూర్, పాలకుర్తి, ధర్మసాగర్, వరంగల్ సిటీ ప్రయాణికులు బస్సుల కోసం రోడ్ల మీద నిరీక్షించారు. అధికారులు స్పెషల్ బస్సుల పేరిట అదనపు ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు మండిపడ్డారు.