పండుగ పూట సొంతూళ్లకు వెళ్దామని బస్టాండ్‌కు వస్తే బస్సుల్లేక.. వచ్చినవి సరిపోక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్లాట్‌ఫాం మీదకు వచ్చిన ప్రతి బస్సు క్షణాల్లో కిక్కిరిసిపోతోంది. దసరా రద్దీ నేపథ్యంలో ఈ నెల 15 వరకు ఆర్టీసీ వరంగల్ రీజియన్ పరిధిలో 900కుపైగా సర్వీసులు నడిపిస్తున్నది. అయితే పలు బస్టాండ్లలో రద్దీ ఎక్కువగా ఉండడంతో బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
– హనుమకొండ చౌరస్తా/మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 11
బస్టాండ్లలో బస్సులు లేక ప్రయాణికులు పిల్లాపాపలతో పడిగాపులు గాస్తున్నారు. బస్సు దొరికితే చాలు కనీసం నిలబడి అయినా వెళ్దామని ఎదురుచూస్తున్నారు. వరంగల్ నుంచి వివిధ రూట్లలో ఎక్స్‌ప్రెస్, సూపర్‌లగ్జరీ బస్సులను రెగ్యులర్‌తోపాటు ప్రత్యేక బస్సులనూ ఆర్టీసీ నడిపిస్తోంది. డీలక్స్ బస్సునూ ప్రత్యేక బస్సుగానే నడిపిస్తూ అధిక చార్జీలు వసూలు చేస్తున్నది. దీంతో సూపర్ లగ్జరీ చార్జీలను డీలక్స్ మించిపోయాయి. ప్రత్యేక సర్వీసుల టికెట్ బేసిక్ ధరలో 25 శాతం పెంచేశారు. దీంతో చార్జీ లు భారీగా పెరిగాయి. ఇక శనివారం నుం చి 50 శాతం పెంచే అవకాశాలున్నాయి. సూపర్‌లగ్జరీ, రాజ ధాని, గరుడ బస్సులకు ఆన్లైన్ చెల్లింపుల్లో ప్రతి టికెట్‌పై అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు.
పలుచోట్ల ప్రయాణికులు డ్రైవర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వా హనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు వా హనాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా చార్జీ లు వసూలు చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మహబూబాబాద్ నుంచి హైదరాబాద్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్, వేముల వాడ రూట్ లో ఎక్కువ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు కిక్కిరిసి వెళ్తున్నారు. ప్రధానంగా ఇనుగుర్తి, తాళ్లపూసపల్లి, వేంనూర్ గ్రామాలకు బస్సులు రాక ట్రాలీ ఆటోలు, టాటా ఏస్‌లను ఆశ్రయిస్తున్నారు. కనీసం ఐదారు గంటలు బస్సుల కోసం ప్రయాణికులు వేచి ఉండాల్సి వస్తున్నది.
మా బాబు ఉప్పల్‌లో ఉంటున్నాడు. అక్కడికి వెళ్లాలంటే బస్సుల్లేవు. నర్సంపేట నుంచి వచ్చేటప్పుడు కూడా అంతే. సీటు కూడా దొరకలేదు. హనుమకొండ బస్‌స్టేషన్‌కు వచ్చి గంటైనా బస్సు రాలే. పైసలు ఎక్కువ తీసుకుంటున్రు. ఛార్జీలు పెంచిన్రు.
– మూడు శత్రువు, ఆకుతండా, నర్సంపేట
వరంగల్ రీజియన్ పరిధిలో దసరా పండుగ సందర్భంగా 900 బస్సులను నడపుతున్నాం. ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా తిప్పుతున్నాం. తిరుగు ప్రయాణానికి అదనంగా 300 బస్సులు తిప్పనున్నాం. స్పెషల్ బస్సులపై అదనంగా 25 శాతం చార్జ్ చేస్తున్నాం. శనివారం నుంచి 50 శాతం పెంచే అవకాశం ఉంది. హనుమకొండ -హైదరాబాద్, భూపాలపల్లి, మంగపేట వైపు రిజర్వేషన్లు ప్రారంభించాం.
– డీ విజయభాను, ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం